యోహాను 18

18
1యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. 2యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. 3కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను. 4యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి–మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. 5వారు–నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు–ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. 6ఆయన–నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. 7మరల ఆయన–మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు–నజరేయుడైన యేసునని చెప్పగా 8యేసు వారితో–నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను. 9–నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. 10సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను. 11ఆ దాసునిపేరు మల్కు. యేసు–కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
12అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి. 13అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ. 14కయప–ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
15సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతోకూడ వెళ్లెను. 16పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను. 17ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడు–కాననెను. 18అప్పుడు చలివేయుచున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.
19ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధనుగూర్చియు యేసును అడుగగా 20యేసు–నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. 21నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. 22ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు – ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. 23అందుకు యేసు–నేను కాని మాట ఆడినయెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావనెను. 24అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.
25సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి–నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు–నేను కాను, నేనెరుగననెను. 26పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును–నీవు తోటలో అతనితోకూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు 27పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
28వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు. 29కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి–ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. 30అందుకు వారు–వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి. 31పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా 32యూదులు–ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.
33పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి–యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా 34యేసు–నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా? అని అడిగెను. 35అందుకు పిలాతు–నేను యూదు డనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా 36యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. 37-38అందుకు పిలాతు–నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు–నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు–సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను.
అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి–అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు; 39అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను. 40అయితే వారు–వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.

Qaqambisa

Yabelana

Kopa

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena

IziCwangciso zokuFunda zasimahla kunye nokuzinikela okunxulumene ne యోహాను 18

I-YouVersion isebenzisa ii cookies ukwenza amava akho abe ngawe. Ngokusebenzisa i-website yethu, uyakwamkela ukusebenzisa kwethu ii cookies njengoko kuchaziwe kuMgaqo-nkqubo wethu