Uphawu lweYouVersion
Khetha Uphawu

ఆదికాండము 11

11
1భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
2వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి 3మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. 4మరియు వారు–మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించు కొందము రండని మాటలాడుకొనగా 5యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. 6అప్పుడు యెహోవా–ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. 7గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. 8ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. 9దానికి బాబెలు#11:9 అనగా, తారుమారు. అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదర గొట్టెను.
10షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను. 11షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
12అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. 13అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
14షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. 15షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
16ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. 17ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
18పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. 19పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
20రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను. 21రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
22సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను. 23సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
24నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను. 25నాహోరు తెరహును కనినతరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
26తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.
27తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. 28హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను. 29అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె. 30శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు. 31తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్లుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. 32తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.

Qaqambisa

Share

Copy

None

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena