ఆది 13

13
అబ్రాము, లోతు ఒకరి నుండి ఒకరు వేరై పోవడం
1అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు. 2అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి.
3అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకూ అంటే బేతేలుకు, హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు. 4అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
5అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, #13:5 అక్షరాలా గుడారాలుపరివారం ఉన్నాయి. 6వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. 7ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు.
8కాబట్టి అబ్రాము “మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు. 9ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను” అని లోతుకు చెప్పాడు.
10లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యక ముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది. 11కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు.
12అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. 13సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు.
అబ్రాము హెబ్రోనుకు పోవడం
14లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా “నువ్వు ఉన్నచోటనుంచి నాలుగు దిక్కులకూ చూడు. 15నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను. 16నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే, నీ వారసులనుకూడా లెక్కపెట్టవచ్చు. 17నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరినుండి ఈ చివరి వరకూ సంచరించు. అదంతా నీకు ఇస్తాను” అని అబ్రాముతో చెప్పాడు. 18అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.

Выбрано:

ఆది 13: IRVTel

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь