ఆది 12

12
అబ్రాముకు దేవుని పిలుపు
1యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల#12:1 లేక నీవు పుట్టిన స్థలం. దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు. 2నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”
4యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు. 5అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు.
6అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు. 7యెహోవా అబ్రాముతో “నీ వారసులకు#12:7 లేక సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.
8అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు. 9అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు.
అబ్రాము, శారయి ఐగుప్తులో
10అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. 11అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో “చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు, 12ఐగుప్తీయులు నిన్ను చూసి, ‘ఈమె అతని భార్య’ అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు. 13నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు” అన్నాడు.
14అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండడం గమనించారు. 15ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్ళారు. 16ఆమె మూలంగా అతడు అబ్రామును చాలా బాగా చూసుకున్నాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, మగ గాడిదలు, సేవకులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు.
17అప్పుడు యెహోవా అబ్రాము భార్య శారయిని బట్టి ఫరోను, అతని ఇంటివాళ్ళను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు. 18అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి “నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? 19ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉంటే ఏమి జరిగేది? ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకువెళ్ళు” అని చెప్పాడు. 20తరువాత ఫరో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అబ్రామును అతని భార్యతో అతని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు.

Выбрано:

ఆది 12: IRVTel

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь