Kisary famantarana ny YouVersion
Kisary fikarohana

యోహాను 13

13
తన శిష్యుల పాదాలను కడిగిన యేసు
1పస్కా పండుగకు ముందు యేసు తాను ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్లవలసిన సమయం వచ్చిందని గ్రహించారు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని, ఆయన అంతం వరకు ప్రేమించాడు.
2వారు సాయంకాల భోజనం చేయడానికి కూర్చున్నారు, అప్పటికే యేసును అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది ప్రేరేపించాడు. 3తండ్రి అన్నిటిని తన అధికారం క్రింద ఉంచాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చాడని, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడని యేసుకు తెలుసు. 4కనుక ఆయన భోజనం దగ్గర నుండి లేచి తన పైవస్త్రాన్ని తీసి, ఒక తువ్వాలును నడుముకు కట్టుకున్నారు. 5ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్ళు పోసి, తన శిష్యుల కాళ్ళను కడిగి, తన చుట్టూ కట్టుకొని ఉన్న తువ్వాలుతో వాటిని తుడవడం మొదలుపెట్టారు.
6ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు, “ప్రభువా, నీవు నా కాళ్ళు కడుగుతావా?” అని అడిగాడు.
7అందుకు యేసు, “నేను చేస్తున్న దానిని ఇప్పుడు మీరు గ్రహించలేరు, కాని తర్వాత గ్రహిస్తారు” అన్నారు.
8పేతురు, “లేదు ప్రభువా, నీవు ఎప్పుడు నా కాళ్ళను కడుగకూడదు” అన్నాడు.
అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడుగకపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు.
9అప్పుడు సీమోను పేతురు, “అయితే ప్రభువా, నా కాళ్ళు మాత్రమే కాకుండా నా చేతులను మరియు తలను కూడా కడుగు!” అన్నాడు.
10అందుకు యేసు, “స్నానం చేసినవారి శరీరం మొత్తం శుభ్రంగా ఉంటుంది, కనుక వారు పాదాలను మాత్రం కడుగుకొంటే చాలు; మీరు శుద్ధులే, కాని అందరు కాదు” అని అన్నారు. 11ఆయనను ఎవరు అప్పగించబోతున్నారో ఆయనకు ముందే తెలుసు, అందుకే ఆయన “మీలో అందరు శుద్ధులు కారు” అన్నారు.
12ఆయన వారి కాళ్ళను కడిగి, ఆయన తన వస్త్రాన్ని వేసుకొని తన కూర్చున్న చోటికి తిరిగి వెళ్లి, “నేను మీకు చేసింది మీరు గ్రహిస్తున్నారా?” అని ఆయన వారిని అడిగి ఇలా చెప్పడం మొదలుపెట్టారు: 13“అవును, మీరు నన్ను ‘బోధకుడని, ప్రభువని’ పిలుస్తున్నారు. నేను అదే అయి ఉన్నాను కనుక ఇలా పిలవడం న్యాయమే. 14నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ కాళ్ళను కడిగాను, కనుక మీరు కూడ ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15నేను మీ కొరకు చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను. 16ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకువెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 17ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కనుక వాటిని పాటిస్తే మీరు ధన్యులు.
తాను అప్పగించబడుటను గురించి యేసు ముందే చెప్పుట
18“నేను మీ అందరిని గురించి చెప్పడం లేదు; మీలో నేను ఎంపిక చేసుకొన్నవారు నాకు తెలుసు. అయితే ‘నాతో భోజనాన్ని పంచుకొనే వాడు నాకు వ్యతిరేకంగా తన మడిమనెత్తాడు’ అనే లేఖనం నెరవేరడానికి ఇది జరగాలి.#13:18 కీర్తన 41:9
19“అది జరగక ముందే నేను మీతో చెప్తున్నాను ఎందుకంటే అది జరిగినప్పుడు, ‘నేనే ఎల్లకాలం ఉన్నవాడను’ అని మీరు నమ్మాలని చెప్తున్నాను. 20నేను పంపే వానిని స్వీకరించే వారు నన్ను స్వీకరిస్తారు; నన్ను స్వీకరించిన వారు నన్ను పంపినవానిని స్వీకరిస్తారు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
21యేసు ఈ మాటలను చెప్పిన తర్వాత, తన ఆత్మలో కలవరపడి, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
22ఆయన తమలో ఎవరిని గురించి చెప్తున్నాడోనని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంతో చూడసాగారు. 23ఆయన శిష్యులలో ఒకడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రక్కన కూర్చొని ఉన్నాడు. 24సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, “ఆయన చెప్పేది ఎవరి గురించి అని ఆయనను అడుగు” అన్నాడు.
25అతడు యేసు రొమ్ముకు ఇంకా దగ్గరగా ఆనుకొని, “ప్రభువా, అతడు ఎవరు?” అని ఆయనను అడిగాడు.
26యేసు, “ఈ గిన్నెలో రొట్టె ముక్కను ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే” అని జవాబిచ్చారు. తర్వాత ఆయన రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చారు. 27యూదా ఆ రొట్టెను తీసుకొన్న వెంటనే సాతాను అతనిలోనికి ప్రవేశించాడు.
అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు. 28కాని యేసు అతనితో ఇది ఎందుకు చెప్పాడో అని ఆ భోజనబల్ల దగ్గర ఉన్న ఎవరికీ తెలియలేదు. 29యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కనుక పండుగ కొరకు అవసరమైన వాటిని కొనడానికి లేదా, పేదవారికి ఏమైనా ఇవ్వుమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు. 30యూదా రొట్టెను తీసుకొన్న వెంటనే వెళ్లిపోయాడు. అది రాత్రి సమయం.
నూతన ఆజ్ఞ
31అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు. 32దేవుడు కుమారునిలో మహిమపొందితే, దేవుడు తనలో కుమారుని మహిమపరచుకొనిన వెంటనే కుమారుని మహిమపరుస్తాడు.
33“నా పిల్లలారా, నేను మీతో ఇంకా కొంత సమయమే ఉంటాను. నేను యూదులకు చెప్పినట్లే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను: మీరు నన్ను వెదకుతారు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.
34“ఒక క్రొత్త ఆజ్ఞను మీకిస్తున్నాను: ఒకరిని ఒకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనే దానిని బట్టి, జనులందరు మీరు నా శిష్యులని తెలుసుకొంటారు” అన్నారు.
36సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆయనను అడిగాడు.
అందుకు యేసు, “నేను వెళ్లే చోటికి నీవిప్పుడు వెంబడించలేవు, కాని నీవు తర్వాత వెంబడిస్తావు” అని అతనితో అన్నారు.
37పేతురు, “ప్రభువా, ఇప్పుడు నేను ఎందుకు నిన్ను వెంబడించలేను? నేను నీ కొరకు నా ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాను” అన్నాడు.
38అప్పుడు యేసు, “నీవు నిజంగా నా కొరకు నీ ప్రాణం త్యాగం చేస్తావా? ఈ రాత్రి కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నేను నీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

Voafantina amin'izao fotoana izao:

యోహాను 13: TCV

Asongadina

Hizara

Dika mitovy

None

Tianao hovoatahiry amin'ireo fitaovana ampiasainao rehetra ve ireo nasongadina? Hisoratra na Hiditra

Horonantsary ho an'i యోహాను 13