యోహాను 14
14
యేసు తన శిష్యులను ఆదరించుట
1“మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి. 2నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, నేను మీతో మీ కొరకు స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పివుండేవాడినా? 3నేను వెళ్లి మీ కొరకు నివాసస్థలాన్ని సిద్ధపరిస్తే, నేను మళ్ళీ వచ్చి నాతో పాటు ఉండడానికి నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. 4నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు” అన్నారు.
తండ్రిని చేరుకొను మార్గం యేసే
5అందుకు తోమా ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. అప్పుడు మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
6అందుకు యేసు, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు. 7మీరు నన్ను నిజంగా తెలుసుకొని ఉంటే, మీకు నా తండ్రి కూడా తెలిసి ఉండేవాడు. ఇప్పటి నుండి మీకు ఆయన తెలుసు, మీరు ఆయనను చూసారు” అన్నారు.
8అందుకు ఫిలిప్పు, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, అది మాకు చాలు” అన్నాడు.
9యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం ఉన్నాక కూడా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు తండ్రిని చూసాడు, కనుక ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు? 10నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నీవు నమ్మడం లేదా? నేను మీతో చెప్పే మాటలు నా అధికారంతో నేను చెప్పడం లేదు, కాని నాలో జీవిస్తూ, తన కార్యాలను చేస్తున్న తండ్రియే చెప్తున్నాడు. 11నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నేను చెప్పినప్పుడు నన్ను నమ్మండి; లేదా కనీసం దానికి రుజువుగా ఉన్న అద్బుత క్రియలమూలంగా నన్ను నమ్మండి. 12నన్ను నమ్మేవారు నేను చేస్తూవున్న పనులను చేస్తారు, వీటికన్నా గొప్ప వాటిని వారు చేస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. 13మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను. 14మీరు నా పేరట ఏమి అడిగినా నేను దానిని చేస్తాను.
పరిశుద్ధాత్ముని గురించిన వాగ్దానము
15“మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. 16మీతో ఎల్లప్పుడు ఉండేలా మరొక ఆదరణకర్తను మీకు ఇవ్వుమని, నేను తండ్రిని అడుగుతాను. 17ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కనుక ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మరియు మీలో ఉంటాడు. 18నేను మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను, మీ దగ్గరకు వస్తాను. 19కొంత కాలమైన తర్వాత ఈ లోకం ఇక నన్ను చూడదు, కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను జీవిస్తాను కనుక మీరు కూడ జీవిస్తారు. 20నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని మీరు ఆ రోజు గుర్తిస్తారు. 21నా ఆజ్ఞలను కలిగి వాటిని పాటించు వారే నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించేవారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నేను కూడ వారిని ప్రేమించి నన్ను నేను వారికి కనపరచుకుంటాను” అన్నారు.
22అప్పుడు, యూదా ఇస్కరియోతు కాదు, మరొక యూదా యేసుతో, “కానీ ప్రభువా, నీవు ఈ లోకానికి కాకుండా మాకే ఎందుకు కనపరచుకోవాలని అనుకుంటున్నావు?” అని అడిగాడు.
23అందుకు యేసు, ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కనుక నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మరియు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము. 24నన్ను ప్రేమించనివారు నా బోధలను పాటించరు. మీరు వింటున్న ఈ మాటలు నా సొంతం కాదు; అవి నన్ను పంపిన తండ్రి మాటలు.
25నేను మీ మధ్య ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పాను. 26కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. 27నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి.
28“ ‘నేను వెళ్లి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను’ అని నేను చెప్పిన మాటను మీరు విని ఉన్నారు. అయితే మీరు నన్ను ప్రేమిస్తే, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నానని సంతోషించేవారు, ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29అది జరిగినప్పుడు మీరు నమ్మాలని, అది జరుగక ముందే ఇప్పుడే మీకు చెప్పాను. 30నేను మీతో ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఈ లోకాధికారి వస్తున్నాడు. కానీ అతనికి నా మీద అధికారం లేదు. 31అయితే నేను తండ్రిని ప్రేమిస్తున్నానని, తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే నేను చేస్తున్నానని ఈ లోకం తెలుసుకోవాలనే అతడు వస్తాడు.
“లేవండి, ఇక్కడి నుండి వెళ్దాం” అన్నారు.
Voafantina amin'izao fotoana izao:
యోహాను 14: TCV
Asongadina
Hizara
Dika mitovy

Tianao hovoatahiry amin'ireo fitaovana ampiasainao rehetra ve ireo nasongadina? Hisoratra na Hiditra
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.