Kisary famantarana ny YouVersion
Kisary fikarohana

యోహాను 12

12
బేతనియలో యేసు అభిషేకించబడుట
1పస్కా పండుగకు ఆరు రోజుల ముందు, యేసు, తాను చనిపోయినవారిలో నుండి లేపిన లాజరు నివసించే బేతనియ అనే ఊరికి వచ్చారు. 2ఇక్కడ యేసు కొరకు విందు సిద్ధం చేయబడింది. ఆ భోజనపు బల్ల దగ్గర లాజరు ఆయనతోపాటు కూర్చున్నవారిలో ఉన్నాడు, మార్త వడ్డిస్తుంది. 3మరియ సుమారు ఐదువందల గ్రాముల,#12:3 ఐదువందల గ్రాముల ఒక సేరున్నర అత్యంత విలువైన జటామాంసి చెట్ల నుండి తీసిన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. అప్పుడు ఆ ఇల్లంతా పరిమళద్రవ్యపు వాసనతో నిండిపోయింది.
4అయితే ఆయనను అప్పగించబోయే, ఆయన శిష్యులలో ఒకడైన, ఇస్కరియోతు యూదా, ఆమె చేసిన దాని గురించి అభ్యంతరం చెప్తూ, 5“ఈ పరిమళద్రవ్యాన్ని మూడువందల దేనారాలకు అమ్మి ఆ డబ్బును పేదవారికి ఇచ్చి ఉండకూడదా? దాని విలువ ఒక పూర్తి సంవత్సరపు జీతానికి సమానం” అన్నాడు. 6అతడు బీదల మీద ఉన్న శ్రద్ధతో ఈ మాటలను చెప్పలేదు కాని అతడు ఒక దొంగ; డబ్బు సంచి కాపలాదారునిగా, అందులో వేయబడిన డబ్బు తన కొరకు వాడుకునేవాడు.
7అందుకు యేసు, “ఆమె చేసేది చెయ్యనివ్వండి, ఎందుకంటే నా భూస్థాపన రోజు కొరకు ఆమె ఈ పరిమళద్రవ్యాన్ని సిద్ధపరచింది. 8బీదలు మీ మధ్య ఎప్పుడు ఉంటారు#12:8 ద్వితీ 15:11 కాని నేను మీతో ఉండను” అన్నారు.
9అంతలో యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకొన్న యూదులు గుంపుగా, ఆయన కొరకు మాత్రమే కాక, చనిపోయి తిరిగి లేపబడిన లాజరును కూడా చూడాలని వచ్చారు. 10కనుక ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచన చేశారు, 11ఎందుకంటే చావు నుండి సజీవంగా లేచిన లాజరును బట్టి యూదులలో చాలామంది తమ వారిని విడిచిపెట్టి, యేసును నమ్ముతున్నారు.
యెరూషలేములో యేసుని విజయోత్సవ ప్రవేశం
12మరునాడు పండుగకు వచ్చిన గొప్ప జనసమూహం యేసు యెరూషలేముకు వస్తున్నాడని విని, 13వారు ఖర్జూరపు మట్టలు తీసుకుని,
“హోసన్నా!”
“ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!”#12:13 కీర్తన 118:25,26
“ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక!”
అని కేకలువేస్తూ ఆయనను కలవడానికి వెళ్లారు. 14యేసు ఒక గాడిద పిల్లను చూసి, దానిపై కూర్చున్నారు. ఎందుకంటే లేఖనాలలో ఈ విధంగా వ్రాయబడి వుంది:
15“సీయోను కుమారీ, భయపడకు!
ఇదిగో, గాడిదపిల్ల మీద కూర్చుని
నీ రాజు వస్తున్నారు.”#12:15 జెకర్యా 9:9
16మొదట ఆయన శిష్యులు ఈ సంగతులను గ్రహించలేదు. కాని యేసు మహిమ పరచబడిన తర్వాత మాత్రమే ఈ సంగతులన్ని ఆయన గురించే వ్రాయబడ్డాయని, అందుకే అవన్నీ ఆయనకు సంభవించాయని జ్ఞాపకం గ్రహించారు.
17యేసు లాజరును సమాధిలో నుండి పిలిచి అతన్ని చావు నుండి సజీవంగా లేపినప్పుడు యేసుతో పాటు ఉన్న ప్రజలందరు ఇతరులకు చెప్తూనే ఉండడంతో ఆ వార్త వ్యాపిస్తూనే ఉంది. 18ఆయన ఈ అద్బుత క్రియను చేశారని విన్న జనసమూహం ఆయనను కలుసుకోవడానికి బయలుదేరి వచ్చారు. 19దీని గురించి పరిసయ్యులు ఒకరితో ఒకరు, “ఇదిగో, లోకమంతా ఆయన వెనుక ఎలా వెళ్లిపోయిందో చూడండి. మనమేమి చేయలేకుండా ఉన్నాం!” అని చెప్పుకొన్నారు.
తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
20ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన గ్రీసుదేశస్థులున్నారు. 21వారు గలిలయలోని బేత్సయిదా గ్రామానికి చెందిన ఫిలిప్పు దగ్గరకు వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అని అన్నారు. 22ఫిలిప్పు వెళ్లి ఆ విషయం అంద్రెయతో చెప్పాడు. ఫిలిప్పు అంద్రెయ కలిసి వెళ్లి యేసుతో చెప్పారు.
23అందుకు యేసు వారితో, “మనుష్యకుమారుడు మహిమ పొందే సమయం వచ్చింది. 24ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది గింజగానే ఉండిపోతుంది. అయితే అది చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. 25తన ప్రాణాన్ని ప్రేమించేవారు దానిని పోగొట్టుకొంటారు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవారు దాన్ని నిత్యజీవం కొరకు కాపాడుకొంటారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 26నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు.
27“ఇప్పుడు నా హృదయం కలవరం చెందుతుంది, నేను ఏమి చెప్పాలి? ‘తండ్రీ, ఈ గడియలో నుండి నన్ను రక్షించవా?’ వద్దు, ఈ కారణం కొరకే నేను ఈ గడియకు చేరుకొన్నాను. 28తండ్రీ, నీ నామాన్ని మహిమపరచు!” అన్నారు.
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దానిని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది. 29అప్పుడు, అక్కడ నిలబడివున్న జనసమూహం దానిని విని ఉరిమింది అన్నారు. మిగిలిన వారు “దేవదూత అతనితో మాట్లాడాడు” అని అన్నారు.
30అప్పుడు యేసు, “ఆ స్వరం నా కొరకు రాలేదు అది మీ కొరకే వచ్చింది. 31ఇప్పుడు లోకానికి తీర్పుతీర్చే సమయం. ఇది ఈ లోకాధికారిని తరిమి వేసే సమయం. 32నేను, భూమి నుండి మీదికి ఎత్తబడినప్పుడు, మానవులందరిని నా దగ్గరకు ఆకర్షించుకొంటాను” అన్నారు. 33ఆయన తాను పొందబోయే మరణాన్ని సూచిస్తూ ఈ మాటను చెప్పారు.
34ఆ జనసమూహం, “క్రీస్తు ఎల్లప్పుడు ఉంటాడని ధర్మశాస్త్రం నుండి మేము విన్నాం, మరి మనుష్యకుమారుడు మీదికి ఎత్తబడాలని నీవు ఎలా చెప్పగలవు? ఈ మనుష్యకుమారుడు ఎవరు?” అని అడిగారు.
35అందుకు యేసు వారితో, “ఇంకా కొంత కాలం మాత్రమే మీ మధ్య వెలుగు ఉంటుంది. చీకటిలో నడిచేవానికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో వానికి తెలియదు కనుక మిమ్మల్ని చీకటి కమ్ముకొనక ముందే, వెలుగు ఉన్నప్పుడే నడవండి 36మీరు వెలుగు కుమారులుగా మారడానికి, మీకు వెలుగు ఉన్నప్పుడే వెలుగును నమ్మండి” అని అన్నారు. యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, వారిని వదిలిపెట్టి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నారు.
యూదులలో విశ్వాసం మరియు అవిశ్వాసం
37యేసు వారి యెదుట అనేక అద్బుత క్రియలను చేసిన తర్వాత కూడ, వారు ఆయనను నమ్మలేదు.
38“ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్మారు,
ప్రభువు బాహువు ఎవరికి వెల్లడి చేయబడింది?”#12:38 యెషయా 53:1
అని యెషయా ప్రవక్త ద్వారా పలుకబడిన మాటలు నెరవేరడానికి ఇది జరిగింది.
39అందుకే వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే మరొక చోట యెషయా ఇలా అన్నాడు:
40“ఆయన వారి కన్నులకు గ్రుడ్డితనాన్ని,
వారి హృదయాలకు కాఠిన్యాన్ని కలుగచేశారు.
అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి
హృదయాలతో గ్రహించి, వారు నా తట్టు తిరిగి ఉండేవారు
అప్పుడు నేను వారిని స్వస్థపరచే వానిని.”#12:40 యెషయా 6:10
41యెషయా యేసు మహిమను చూశాడు కనుక ఆయనను గురించి ఈ మాట చెప్పాడు.
42అధికారులలో కూడ చాలామంది ఆయనను నమ్మారు. కాని వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకొంటే పరిసయ్యులు తమను సమాజమందిరం నుండి వెలివేస్తారని భయపడ్డారు. 43ఎందుకంటే వారు దేవుని మెప్పు కన్నా, ప్రజల మెప్పునే ఎక్కువగా ఇష్టపడ్డారు.
44అప్పుడు యేసు బిగ్గరగా, “ఎవరైతే నన్ను నమ్ముతారో, వారు నన్ను మాత్రమే కాదు, నన్ను పంపినవానిని కూడ నమ్ముతున్నారు. 45నన్ను చూసేవాడు నన్ను పంపినవానిని చూస్తున్నాడు. 46నన్ను నమ్మిన ఏ ఒక్కరు చీకటిలో ఉండకూడదని, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను.
47“ఎవరైనా నా మాటలను విని వాటిని పాటించకపోతే, నేను వానికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కాని, రక్షించడానికే వచ్చాను. 48నన్ను తిరస్కరించి నా మాటలను స్వీకరించని వాని కొరకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు; నేను పలికిన ఈ మాటలే చివరి రోజున వానిని తీర్పు తీరుస్తాయి. 49నా అంతట నేను మాట్లాడడం లేదు, కాని నేను ఏమి మాట్లాడాలని నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించాడో దానినే నేను మాట్లాడాను. 50తండ్రి ఆజ్ఞ నిత్యజీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుకే తండ్రి చెప్పమని నాకు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను” అని చెప్పారు.

Voafantina amin'izao fotoana izao:

యోహాను 12: TCV

Asongadina

Hizara

Dika mitovy

None

Tianao hovoatahiry amin'ireo fitaovana ampiasainao rehetra ve ireo nasongadina? Hisoratra na Hiditra

Horonantsary ho an'i యోహాను 12