మార్కు 5:21-43
మార్కు 5:21-43 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు మరల పడవ ఎక్కి సరస్సు అవతలి ఒడ్డుకు చేరినప్పుడు, ఆ సరస్సు ఒడ్డున గొప్ప జనసమూహం ఆయన చుట్టూ చేరింది. అప్పుడు సమాజమందిరపు నాయకులలో ఒకడైన యాయీరు అనే పేరుగలవాడు వచ్చి, యేసును చూడగానే, ఆయన పాదాల మీద పడ్డాడు. “నా చిన్న కుమార్తె చనిపోయేలా ఉంది, నీవు వచ్చి ఆమె మీద నీ చేతులుంచితే ఆమె బాగై బ్రతుకుతుంది” అని ఆయనను వేడుకున్నాడు. కనుక యేసు అతనితో వెళ్లారు. పెద్ద జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఆయన చుట్టూ మూగారు. మరియు పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఎందరో వైద్యుల దగ్గరకు తిప్పలుపడి వెళ్లి తనకు ఉన్నదంతా ఖర్చుపెట్టినా, జబ్బు బాగవ్వడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించిపోయింది. ఆమె యేసు గురించి విన్నప్పుడు, తన మనసులో, “నేను ఆయన వస్త్రాన్ని మాత్రం తాకితే చాలు స్వస్థపడతాను” అనుకుని, జనసమూహంలో ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, తన శరీరంలో ఉన్న బాధ నుండి తాను విడుదల పొందినట్లు ఆమె గ్రహించింది. వెంటనే యేసు తనలో నుండి శక్తి బయటికి వెళ్లిందని గ్రహించారు. ఆయన జనసమూహంలో చుట్టూ తిరిగి, “నా వస్త్రాలను ఎవరు తాకారు?” అని అడిగారు. అందుకు ఆయన శిష్యులు, “ఈ జనసమూహం అంతా నీ మీద పడుతూ ఉండడం నీవు చూస్తూనే ఉన్నావు అయినా, ‘నన్ను తాకింది ఎవరు?’ అని అడుగుతున్నావు” అని అన్నారు. అయినా యేసు తనను తాకింది ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీ, తనకు జరిగింది తెలుసుకొని, వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, భయంతో వణుకుతూ తనకు జరిగిందంతా ఆయనకు చెప్పింది. అందుకు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు నీ బాధ నుండి విడుదల పొందుకో” అని చెప్పారు. యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చారు. వారు యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది. ఇంకా బోధకునికి శ్రమ కలిగించడం ఎందుకు?” అన్నారు. యేసు వారు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, సమాజమందిరపు అధికారితో, “భయపడకు; నమ్మకం మాత్రం ఉంచు” అని చెప్పారు. పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడైన యోహాను అనే వారిని తప్ప ఆయన మరి ఎవరిని తన వెంట తీసుకువెళ్లలేదు. వారు సమాజమందిరపు నాయకుని ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి వారు గట్టిగా ఏడుస్తూ, ప్రలాపిస్తూ, గందరగోళంగా ఉండడం యేసు చూసారు ఆయన ఇంట్లోకి వెళ్లి వారితో, “మీరెందుకు ప్రలాపించి ఏడుస్తున్నారు? అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. అందుకు వారు ఆయనను హేళన చేశారు. అయితే ఆయన వారందరిని బయటకు పంపిన తర్వాత, ఆ అమ్మాయి తల్లిదండ్రులను తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకొని, ఆ అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్లారు. ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకొని, “తలితాకుమి!” అన్నారు. ఆ మాటకు “చిన్నదానా, లే!” అని అర్థం. వెంటనే ఆ అమ్మాయి లేచి నడవ మొదలు పెట్టింది. ఆ అమ్మాయి వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఇది చూసిన వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. జరిగిన ఈ సంగతి ఎవనికి తెలియకూడదని ఆయన వారికి ఖచ్చితంగా ఆదేశించి, ఆమెకు ఆహారం పెట్టమని చెప్పారు.
మార్కు 5:21-43 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది. అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి “నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది” అని దీనంగా వేడుకున్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది. పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది. యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది. వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్ళిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, “నా బట్టలు తాకినదెవరు?” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‘నన్ను తాకినది ఎవరు?’ అంటున్నావేమిటి!” అన్నారు. కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు. ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది. ఆయన ఆమెతో, “అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు” అన్నాడు. యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, “నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు?” అని అన్నారు. యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు. అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు. ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, “ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే” అన్నాడు. కాని, వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. ఆ మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం. వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.
మార్కు 5:21-43 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు. ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి, “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది. పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది. ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది. వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు. కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు. యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారియైన యాయీరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి?” అని అన్నారు. యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మకంతో ఉండు” అని అన్నాడు. యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు. యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు. ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు. కాని వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న గదికి వెళ్ళాడు. ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. ( తలీతాకుమీ అంటే “చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము!” అని అర్థం.) ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. (ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు.) ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా యివ్వమని వాళ్ళకు చెప్పాడు.
మార్కు 5:21-43 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. ఆమె యేసునుగూర్చి విని–నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగి–నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా ఆయన శిష్యులు –జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్నుముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన – కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. యేసు వారు చెప్పినమాట లక్ష్యపెట్టక–భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి లోపలికిపోయి– మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చెయిపెట్టి– తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.