మార్కు 5:21-43

మార్కు 5:21-43 IRVTEL

యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది. అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి “నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది” అని దీనంగా వేడుకున్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది. పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది. యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది. వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్ళిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, “నా బట్టలు తాకినదెవరు?” అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‘నన్ను తాకినది ఎవరు?’ అంటున్నావేమిటి!” అన్నారు. కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు. ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది. ఆయన ఆమెతో, “అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు” అన్నాడు. యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, “నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు?” అని అన్నారు. యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు. అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు. ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, “ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే” అన్నాడు. కాని, వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. ఆ మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం. వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.