మార్కు 5

5
దయ్యము పట్టిన వాన్ని బాగుచేసిన యేసు
1వారు సరస్సు దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్లారు. 2యేసు పడవ దిగిన వెంటనే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. 3వాడు సమాధుల్లో నివసించేవాడు, గొలుసులతో కూడా ఎవరు వాన్ని బంధించలేక పోయారు. 4ఎందుకంటే తరచుగా వాని కాళ్ళుచేతులను గొలుసులతో బంధించేవారు కానీ, వాడు ఆ గొలుసులను తెంపి వాటిని ముక్కలు చేసేవాడు. వాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. 5వాడు పగలు రాత్రులు సమాధుల మధ్య, కొండల్లో కేకలువేస్తూ తనను తాను రాళ్ళతో గాయపరచుకొనే వాడు.
6వాడు యేసును దూరం నుండి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయన ముందు మోకరించాడు. 7వాడు బిగ్గరగా కేకలువేస్తూ, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? దేవుని పేరట నన్ను వేధించవద్దని నిన్ను వేడుకొంటున్నాను!” అని అన్నాడు. 8ఎందుకంటే యేసు, “అపవిత్రాత్మా, వీన్ని విడిచిపో!” అని వానితో అన్నారు.
9అప్పుడు యేసు, “నీ పేరేమిటి?” అని వాన్ని అడిగారు.
అందుకు వాడు, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులం” అని చెప్పాడు. 10“వాటిని ఆ ప్రాంతం నుండి బయటకు పంపివేయవద్దని” వాడు యేసును మళ్ళీ మళ్ళీ వేడుకొన్నాడు.
11అక్కడ దగ్గరలో పెద్ద పందుల మంద కొండ మీద మేస్తూ ఉంది. 12ఆ దయ్యాలు, “ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని యేసును బ్రతిమలాడాయి. 13ఆయన వాటికి అనుమతి ఇచ్చారు, ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందులలోనికి చొరబడ్డాయి. ఇంచుమించు రెండువేల పందులు గల ఆ మంద, వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.
14ఆ పందులను కాస్తున్నవారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను, గ్రామీణ ప్రాంతంలోను జరిగినదంతా తెలియజేసారు, అప్పుడు ఏమి జరిగిందో చూడడానికి ప్రజలు వెళ్లారు. 15వారు యేసు వద్దకు వచ్చినప్పుడు, సేన దయ్యం పట్టినవాడు, బట్టలు వేసుకొని సరియైన మానసిక స్థితిలో, అక్కడ కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు. 16జరిగింది చూసినవారు దయ్యాలు పట్టినవాని గురించి మరియు పందుల గురించి ఊరి వారికి తెలియజేసారు. 17అప్పుడు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ప్రజలు యేసును బ్రతిమలాడారు.
18యేసు పడవ ఎక్కుతున్నప్పుడు, దయ్యాలు పట్టినవాడు ఆయనతో పాటు వస్తానని బ్రతిమలాడాడు. 19యేసు వాన్ని అనుమతించలేదు, కాని వానితో, “నీవు నీ ఇంటికి నీ స్వంతవారి దగ్గరకు వెళ్లు, ప్రభువు నీ పట్ల చేసిన మేలును, నీ పట్ల చూపిన కనికరం గురించి వారికి చెప్పు” అన్నారు. 20కనుక వాడు వెళ్లిపోయి దెకపొలిలోని#5:20 దెకపొలి అనగా పది పట్టణాలు పది పట్టణాలలో యేసు తనకు చేసిన వాటిని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అది విన్న వారందరు ఆశ్చర్యపడ్డారు.
యేసు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరచుట మరియు చనిపోయిన చిన్నదానిని బ్రతికించుట
21యేసు మరల పడవ ఎక్కి సరస్సు అవతలి ఒడ్డుకు చేరినప్పుడు, ఆ సరస్సు ఒడ్డున గొప్ప జనసమూహం ఆయన చుట్టూ చేరింది. 22అప్పుడు సమాజమందిరపు నాయకులలో ఒకడైన యాయీరు అనే పేరుగలవాడు వచ్చి, యేసును చూడగానే, ఆయన పాదాల మీద పడ్డాడు. 23“నా చిన్న కుమార్తె చనిపోయేలా ఉంది, నీవు వచ్చి ఆమె మీద నీ చేతులుంచితే ఆమె బాగై బ్రతుకుతుంది” అని ఆయనను వేడుకున్నాడు. 24కనుక యేసు అతనితో వెళ్లారు.
పెద్ద జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఆయన చుట్టూ మూగారు. 25మరియు పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. 26ఆమె ఎందరో వైద్యుల దగ్గరకు తిప్పలుపడి వెళ్లి తనకు ఉన్నదంతా ఖర్చుపెట్టినా, జబ్బు బాగవ్వడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించిపోయింది. 27-28ఆమె యేసు గురించి విన్నప్పుడు, తన మనసులో, “నేను ఆయన వస్త్రాన్ని మాత్రం తాకితే చాలు స్వస్థపడతాను” అనుకుని, జనసమూహంలో ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని తాకింది. 29వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, తన శరీరంలో ఉన్న బాధ నుండి తాను విడుదల పొందినట్లు ఆమె గ్రహించింది.
30వెంటనే యేసు తనలో నుండి శక్తి బయటికి వెళ్లిందని గ్రహించారు. ఆయన జనసమూహంలో చుట్టూ తిరిగి, “నా వస్త్రాలను ఎవరు తాకారు?” అని అడిగారు.
31అందుకు ఆయన శిష్యులు, “ఈ జనసమూహం అంతా నీ మీద పడుతూ ఉండడం నీవు చూస్తూనే ఉన్నావు అయినా, ‘నన్ను తాకింది ఎవరు?’ అని అడుగుతున్నావు” అని అన్నారు.
32అయినా యేసు తనను తాకింది ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉన్నారు. 33అప్పుడు ఆ స్త్రీ, తనకు జరిగింది తెలుసుకొని, వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, భయంతో వణుకుతూ తనకు జరిగిందంతా ఆయనకు చెప్పింది. 34అందుకు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు నీ బాధ నుండి విడుదల పొందుకో” అని చెప్పారు.
35యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చారు. వారు యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది. ఇంకా బోధకునికి శ్రమ కలిగించడం ఎందుకు?” అన్నారు.
36యేసు వారు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, సమాజమందిరపు అధికారితో, “భయపడకు; నమ్మకం మాత్రం ఉంచు” అని చెప్పారు.
37పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడైన యోహాను అనే వారిని తప్ప ఆయన మరి ఎవరిని తన వెంట తీసుకువెళ్లలేదు. 38వారు సమాజమందిరపు నాయకుని ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి వారు గట్టిగా ఏడుస్తూ, ప్రలాపిస్తూ, గందరగోళంగా ఉండడం యేసు చూసారు 39ఆయన ఇంట్లోకి వెళ్లి వారితో, “మీరెందుకు ప్రలాపించి ఏడుస్తున్నారు? అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. 40అందుకు వారు ఆయనను హేళన చేశారు.
అయితే ఆయన వారందరిని బయటకు పంపిన తర్వాత, ఆ అమ్మాయి తల్లిదండ్రులను తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకొని, ఆ అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్లారు. 41ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకొని, “తలితాకుమి!” అన్నారు. ఆ మాటకు “చిన్నదానా, లే!” అని అర్థం. 42వెంటనే ఆ అమ్మాయి లేచి నడవ మొదలు పెట్టింది. ఆ అమ్మాయి వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఇది చూసిన వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. 43జరిగిన ఈ సంగతి ఎవనికి తెలియకూడదని ఆయన వారికి ఖచ్చితంగా ఆదేశించి, ఆమెకు ఆహారం పెట్టమని చెప్పారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మార్కు 5: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి