మార్కు 5:21-29
మార్కు 5:21-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. ఆమె యేసునుగూర్చి విని–నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను.
మార్కు 5:21-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు మరల పడవ ఎక్కి సరస్సు అవతలి ఒడ్డుకు చేరినప్పుడు, ఆ సరస్సు ఒడ్డున గొప్ప జనసమూహం ఆయన చుట్టూ చేరింది. అప్పుడు సమాజమందిరపు నాయకులలో ఒకడైన యాయీరు అనే పేరుగలవాడు వచ్చి, యేసును చూడగానే, ఆయన పాదాల మీద పడ్డాడు. “నా చిన్న కుమార్తె చనిపోయేలా ఉంది, నీవు వచ్చి ఆమె మీద నీ చేతులుంచితే ఆమె బాగై బ్రతుకుతుంది” అని ఆయనను వేడుకున్నాడు. కనుక యేసు అతనితో వెళ్లారు. పెద్ద జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఆయన చుట్టూ మూగారు. మరియు పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఎందరో వైద్యుల దగ్గరకు తిప్పలుపడి వెళ్లి తనకు ఉన్నదంతా ఖర్చుపెట్టినా, జబ్బు బాగవ్వడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించిపోయింది. ఆమె యేసు గురించి విన్నప్పుడు, తన మనసులో, “నేను ఆయన వస్త్రాన్ని మాత్రం తాకితే చాలు స్వస్థపడతాను” అనుకుని, జనసమూహంలో ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, తన శరీరంలో ఉన్న బాధ నుండి తాను విడుదల పొందినట్లు ఆమె గ్రహించింది.
మార్కు 5:21-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది. అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి “నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది” అని దీనంగా వేడుకున్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది. పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది. యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది.
మార్కు 5:21-29 పవిత్ర బైబిల్ (TERV)
యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు. ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి, “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది. పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది. ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది.