మార్కు 5:21-29

మార్కు 5:21-29 TERV

యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు. ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి, “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు. యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది. పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది. ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది.