మార్కు 14:12-25
మార్కు 14:12-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, అది ఆచార ప్రకారం పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం, యేసు శిష్యులు ఆయనతో, “నీ కొరకు పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు. యేసు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, వారితో ఈ విధంగా అన్నారు, “మీరు పట్టణంలోనికి వెళ్లినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకొని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, మీరు అతన్ని వెంబడించండి. అతడు ప్రవేశించే ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, నా అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. అతడు అన్ని సదుపాయాలతో, సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. మన కొరకు అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు. శిష్యులు పట్టణంలోనికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొన్నారు. కనుక అక్కడ వారు పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు. సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండు మంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. వారంతా బల్ల దగ్గర కూర్చొని తింటున్నప్పుడు, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు నాతో పాటు భోజనం చేస్తున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు. వారికి దుఃఖం కలిగింది, ఒకరి తర్వాత ఒకరు ఆయనతో, “ఖచ్చితంగా నేనైతే కాదు కదా?” అన్నారు. అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో కలిసి రొట్టెను గిన్నెలో ముంచేవాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకొని, దాని కొరకు కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు. ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు. యేసు వారితో, “ఇది అనేకుల కొరకు చిందించనున్న నా నిబంధన రక్తం. దేవుని రాజ్యంలో నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగనని మీతో చెప్తున్నాను” అన్నారు.
మార్కు 14:12-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు. యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి. అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు. ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు. సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అన్నాడు. వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరవాత ఒకరు ఆయనతో, “నేను కాదు కదా!” అన్నారు. ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే! ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది” అన్నాడు. వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు. తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు. ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు.
మార్కు 14:12-25 పవిత్ర బైబిల్ (TERV)
పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు. యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి. అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి. అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.” శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు. సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు. వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు. యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు. అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు. ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు. “ఇది నా నిబంధన రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను. ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు.
మార్కు 14:12-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమునవారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులు–నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ వలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన –మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి–నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన – పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను. వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన –ఇది నిబంధనవిషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
మార్కు 14:12-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, అది ఆచార ప్రకారం పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం, యేసు శిష్యులు ఆయనతో, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు. యేసు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, వారితో ఈ విధంగా అన్నారు, “మీరు పట్టణంలోనికి వెళ్లినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, మీరు అతన్ని వెంబడించండి. అతడు ప్రవేశించే ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, నా అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. అతడు అన్ని సదుపాయాలతో, సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు. శిష్యులు పట్టణంలోనికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొన్నారు. కాబట్టి అక్కడ వారు పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు. సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండుమంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. వారంతా బల్ల దగ్గర కూర్చుని తింటున్నప్పుడు, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు నాతో పాటు భోజనం చేస్తున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు. వారికి దుఃఖం కలిగింది, ఒకరి తర్వాత ఒకరు ఆయనతో, “ఖచ్చితంగా నేనైతే కాదు కదా?” అన్నారు. అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో పాటు రొట్టెను గిన్నెలో ముంచేవాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు. ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు. యేసు వారితో, “ఇది అనేకుల కోసం చిందించనున్న నా నిబంధన రక్తము. దేవుని రాజ్యంలో నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగనని మీతో చెప్తున్నాను” అన్నారు.