పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు. యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి. అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి. అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు. ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు. సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అన్నాడు. వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరవాత ఒకరు ఆయనతో, “నేను కాదు కదా!” అన్నారు. ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే! ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది” అన్నాడు. వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు. తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు. ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు.
Read మార్కు 14
వినండి మార్కు 14
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 14:12-25
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు