మార్కు సువార్త 14
14
బేతనియలో అభిషేకించబడిన యేసు
1పస్కా పండుగ పులియని రొట్టెల పండుగకు ఇంకా రెండు రోజులు ఉందనగా, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసును రహస్యంగా పట్టుకుని చంపడానికి కుట్ర పన్నుతున్నారు. 2“కాని పండుగ సమయంలో వద్దు, ఎందుకంటే ప్రజలు అల్లరి చేయవచ్చు” అని చెప్పుకున్నారు.
3యేసు బేతనియలో, కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, ఒక స్త్రీ చాలా విలువైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆ సీసాను పగులగొట్టి ఆ పరిమళద్రవ్యాన్ని యేసు తలమీద పోసింది.
4అక్కడ ఉన్న కొందరు కోప్పడి, “పరిమళద్రవ్యాన్ని ఇలా ఎందుకు వృధా చేయడం? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. 5ఈ పరిమళద్రవ్యాన్ని మూడువందల దేనారాలకు అమ్మి ఆ డబ్బును పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అని ఆ స్త్రీని కోపంగా గద్దించారు.
6అందుకు యేసు, “ఆమెను ఒంటరిగా వదిలేయండి, ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఆమె నా కోసం ఒక కార్యం చేసింది. 7పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు,#14:7 ద్వితీ 15:11 మీకు ఇష్టం వచ్చిన సమయంలో మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని నేను మీతో ఉండను. 8ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేయడానికి ఆమె ముందుగానే పరిమళద్రవ్యాన్ని నా శరీరం మీద పోసింది. 9సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
10పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల చేతికి యేసును అప్పగించడానికి వారి దగ్గరకు వెళ్లాడు. 11ఇది విని వారు సంతోషించి వానికి డబ్బులు ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి వాడు యేసును అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.
చివరి పస్కా భోజనం
12పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, అది ఆచార ప్రకారం పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం, యేసు శిష్యులు ఆయనతో, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు.
13యేసు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, వారితో ఈ విధంగా అన్నారు, “మీరు పట్టణంలోనికి వెళ్లినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, మీరు అతన్ని వెంబడించండి. 14అతడు ప్రవేశించే ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, నా అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. 15అతడు అన్ని సదుపాయాలతో, సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు.
16శిష్యులు పట్టణంలోనికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొన్నారు. కాబట్టి అక్కడ వారు పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు.
17సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండుమంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. 18వారంతా బల్ల దగ్గర కూర్చుని తింటున్నప్పుడు, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు నాతో పాటు భోజనం చేస్తున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.
19వారికి దుఃఖం కలిగింది, ఒకరి తర్వాత ఒకరు ఆయనతో, “ఖచ్చితంగా నేనైతే కాదు కదా?” అన్నారు.
20అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో పాటు రొట్టెను గిన్నెలో ముంచేవాడు. 21మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు.
22వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు.
23ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు.
24యేసు వారితో, “ఇది అనేకుల కోసం చిందించనున్న నా నిబంధన రక్తము. 25దేవుని రాజ్యంలో నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగనని మీతో చెప్తున్నాను” అన్నారు.
26వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు.
పేతురు తనను నిరాకరిస్తాడని ముందుగానే చెప్పిన యేసు
27యేసు వారితో, “మీరందరు చెదరిపోతారు, ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:
“ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను,
అప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి.’#14:27 జెకర్యా 13:7
28కాని నేను తిరిగి లేచిన తర్వాత మీకంటే ముందు గలిలయ ప్రాంతానికి వెళ్తాను” అని చెప్పారు.
29అప్పుడు పేతురు ఆయనతో, “అందరు నిన్ను విడిచినా, నేను విడువను” అన్నాడు.
30అందుకు యేసు, “ఈ రాత్రే కోడి రెండు సార్లు కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
31కాని పేతురు నొక్కి చెప్తూ, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులు కూడా అలాగే అన్నారు.
గెత్సేమనే తోట
32తర్వాత వారు గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థనచేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని అన్నారు. 33ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని పోయి, తీవ్ర వేదనతో బాధపడసాగారు. 34ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి” అని చెప్పారు.
35ఆయన కొంత దూరం వెళ్లి, నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటి పోవాలని ప్రార్థించారు. 36ఆయన, “అబ్బా, తండ్రీ, నీకు సమస్తం సాధ్యమే. ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, మీ చిత్తమే జరగాలి” అన్నారు.
37ఆయన తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “సీమోనూ, నిద్రిస్తున్నావా? ఒక గంటయైనా మెలకువగా ఉండలేవా? 38మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు.
39ఆయన మళ్ళీ వెళ్లి అదే విధంగా ప్రార్థించారు. 40ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్లు బరువుగా ఉన్నాయి, కాబట్టి వారు మళ్ళీ నిద్రపోతున్నారని తెలుసుకున్నారు. ఆయనకు ఏమి చెప్పాలో వారికి తెలియలేదు.
41యేసు మూడవసారి తిరిగివచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇక చాలు! చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. 42వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
యేసు బంధించబడుట
43ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది.
44ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు: “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించి బందోబస్తుతో తీసుకెళ్లండి.” 45యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. 46వారు వచ్చి యేసును పట్టుకొని, ఆయనను బంధించారు. 47యేసు ప్రక్కన నిలుచున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి చెవిని నరికివేశాడు.
48యేసు, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? 49నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, మీతోనే ఉన్నాను, మీరు నన్ను బంధించలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలని ఇలా జరిగింది” అని చెప్పారు. 50అప్పుడు అందరు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోయారు.
51సన్నని నార వస్త్రం మాత్రమే ధరించిన ఒక యువకుడు, యేసును వెంబడిస్తున్నాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు, 52అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు.
మహాసభ ముందు యేసు
53వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు. 54పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కాపలా కాస్తున్న వారితో చలిమంట దగ్గర కూర్చుని, చలి కాచుకుంటున్నాడు.
55ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు. 56ఆయనకు వ్యతిరేకంగా అనేకులు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, కాని వాటిలో ఒకదానికొకటి సరిపోలేదు.
57-58అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా ఈ అబద్ధసాక్ష్యం చెప్పారు: “ ‘ఇతడు మనుష్యుల చేతులతో కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో మనుష్యుల చేతులతో కట్టని మరొక దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. 59అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు.
60అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి యేసును, “నీవు వారికి సమాధానం ఇవ్వవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న సాక్ష్యాల గురించి నీవు ఏమంటావు?” అని అడిగాడు. 61కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు.
ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?” అని అడిగాడు.
62అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు.
63-64అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు.
అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు. 65ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయడం మొదలుపెట్టారు; వారు ఆయన కళ్లు మూసి, ఆయనను తమ పిడికిళ్ళతో గుద్ది, “నిన్ను ఎవరు కొట్టారో, చెప్పు!” అన్నారు. కావలివారు కూడా ఆయనను పట్టుకుని కొట్టారు.
యేసు ఎవరో తెలియదని బొంకిన పేతురు
66పేతురు ఇంటి ప్రాంగణంలో క్రింది భాగంలో ఉన్నప్పుడు, ప్రధాన యాజకుని దగ్గర పని చేసే అమ్మాయి అక్కడికి వచ్చింది. 67పేతురు చలి కాచుకుంటూ ఉండగా ఆమె, అతన్ని దగ్గర నుండి చూసింది.
ఆ అమ్మాయి పేతురుతో, “నీవు కూడా నజరేతువాడైన, యేసుతో ఉన్నావు” అన్నది.
68కాని దానికతడు ఒప్పుకోలేదు. “నీవు ఏమి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్పి, అతడు ద్వారం వైపుకు వెళ్లాడు. వెంటనే కోడి కూసింది.
69ఆ దాసియైన అమ్మాయి అతన్ని అక్కడ చూసినప్పుడు, చుట్టూ నిలబడి ఉన్నవారితో, “ఇతడు కూడా వారిలో ఒకడే” అన్నది. 70అతడు మళ్ళీ తిరస్కరించాడు.
కొంతసేపటి తర్వాత, పేతురుకు దగ్గరలో నిలబడినవారు పేతురుతో, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి, ఎందుకంటే నీవు గలిలయ వాడవు” అన్నారు.
71అందుకతడు శపించడం మొదలుపెట్టి, “మీరు ఎవరి గురించైతే మాట్లాడుతున్నారో ఆయన నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు.
72వెంటనే రెండవసారి కోడి కూసింది. అప్పుడు పేతురు, “కోడి రెండు సార్లు కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని, వెక్కివెక్కి ఏడ్చాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
మార్కు సువార్త 14: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.