పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, అది ఆచార ప్రకారం పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం, యేసు శిష్యులు ఆయనతో, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు.
యేసు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, వారితో ఈ విధంగా అన్నారు, “మీరు పట్టణంలోనికి వెళ్లినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, మీరు అతన్ని వెంబడించండి. అతడు ప్రవేశించే ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, నా అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. అతడు అన్ని సదుపాయాలతో, సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు.
శిష్యులు పట్టణంలోనికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొన్నారు. కాబట్టి అక్కడ వారు పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు.
సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండుమంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. వారంతా బల్ల దగ్గర కూర్చుని తింటున్నప్పుడు, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు నాతో పాటు భోజనం చేస్తున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.
వారికి దుఃఖం కలిగింది, ఒకరి తర్వాత ఒకరు ఆయనతో, “ఖచ్చితంగా నేనైతే కాదు కదా?” అన్నారు.
అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో పాటు రొట్టెను గిన్నెలో ముంచేవాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు.
వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు.
ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు.
యేసు వారితో, “ఇది అనేకుల కోసం చిందించనున్న నా నిబంధన రక్తము. దేవుని రాజ్యంలో నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగనని మీతో చెప్తున్నాను” అన్నారు.