మార్కు 1:21-45

మార్కు 1:21-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపెట్టిన మనుష్యుడొకడుండెను. వాడు–నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. అందరును విస్మయమొంది – ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను. వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపెట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పెట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి; పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను. ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితోకూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, –అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను. ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన–ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:21-45 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వారు కపెర్నహూముకు వెళ్లారు, మరియు సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా కాక, ఒక అధికారం కలవానిగా వారికి బోధించారు. అంతలో వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు, “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు!” అని బిగ్గరగా కేకలు వేసాడు. అందుకు యేసు కఠినంగా, “మాట్లాడకు!” అని, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ వానిని బలంగా కుదిపి పెద్ద కేకలు వేసి వానిలో నుండి బయటకు వచ్చేసింది. ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఇదేంటి? అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధ! ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుతున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఇలా ఆయనను గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది. వారు సమాజమందిరం నుండి బయటకు రాగానే, వారు యాకోబు మరియు యోహానుతో కలిసి అంద్రెయ, సీమోనుల ఇంటికి వెళ్లారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. కనుక ఆయన ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకొని లేవనెత్తారు. జ్వరం ఆమెను వదలిపోయింది అప్పుడు ఆమె వారికి పరిచారం చేయడం మొదలు పెట్టింది. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు రోగాలు గలవారినందరిని మరియు దయ్యాలు పట్టినవారిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. పట్టణస్థులందరు ఆ ఇంటి ద్వారం దగ్గర కూడుకొన్నారు, వివిధ రోగాలు గల అనేకులను యేసు స్వస్థపరిచారు. ఆయన అనేక దయ్యాలను వెళ్లగొట్టారు, అయితే ఆ దయ్యాలకు తాను ఎవరో తెలుసు, కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. చాలా ప్రొద్దున, ఇంకా చీకటిగా ఉండగానే యేసు నిద్రలేచి, ఇంటి నుండి బయలుదేరి తాను ప్రార్థించే ఏకాంత స్థలానికి వెళ్లారు. సీమోను, అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్లి, ఆయనను కనుగొని, “అందరు నీ కొరకు వెదకుతున్నారు!” అని చెప్పారు. అందుకు యేసు, “మనం దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్దాం రండి, అప్పుడు నేను అక్కడ కూడా ప్రకటించగలను, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అని వారితో చెప్పారు. కనుక ఆయన గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాలలో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్లగొడుతూ ఉన్నారు. కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి, “నీకిష్టమైతే, నన్ను శుద్ధునిగా చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు వాని మీద కనికరపడ్డారు. ఆయన తన చేయి చాపి వాన్ని ముట్టారు. వానితో, “నాకు ఇష్టమే, శుద్ధుడవు అవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వానిని వదలిపోయి వాడు శుద్ధుడయ్యాడు. వెంటనే యేసు: “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా నీ శుద్ధీకరణ కొరకు మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని హెచ్చరించి వానిని పంపివేసారు. కాని వాడు వెళ్లి ఈ విషయాన్ని అందరితో చెప్తూ, ఆ వార్తను వ్యాపింపచేశాడు. దాని ఫలితంగా యేసు ఆ పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక ఎవరు నివసించని బయటి ప్రదేశాలలో ఉన్నారు. అయినాసరే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆయన దగ్గరకు వస్తూనే ఉన్నారు.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:21-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు. ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది. సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది. సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు. ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు. కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:21-45 పవిత్ర బైబిల్ (TERV)

అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు. వాడు, “నజరేయుడవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నాడు. యేసు, “నోరుమూసుకో వాని నుండి బయటకు రా!” అని గద్దిస్తూ అన్నాడు. ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది. ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, “ఇదేమిటి? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తున్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడుకున్నారు. గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి ఆయన గురించి తెలిసిపోయింది. వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్ళారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు పరిచర్యలు చెయ్యటం మొదలు పెట్టింది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆ ఊరంతా ఆయనవున్న యింటిముందు చేరుకుంది. రకరకాల వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ప్రార్థించాడు. సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు. ఆయన్ని చూసి వాళ్ళు, “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు. యేసు సమాధానం చెబుతూ, “ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” అని అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు. ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, “మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు” అని వేడుకున్నాడు. యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే దయ చూపుతాను!” అని అంటూ అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది. అతణ్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు. కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకొ” అని గట్టిగా చెప్పాడు. కాని అతడు వెళ్ళి అందరికి చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేక పొయ్యాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేసాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.

షేర్ చేయి
Read మార్కు 1

మార్కు 1:21-45 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

వారు కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక, ఒక అధికారం కలవానిగా వారికి బోధించారు. అంతలో వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు, “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు!” అని బిగ్గరగా కేకలు వేశాడు. అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ వానిని బలంగా కుదిపి పెద్ద కేకలు వేసి వానిలో నుండి బయటకు వచ్చేసింది. ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఇదేంటి? అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధ! ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుతున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఇలా ఆయనను గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది. వారు సమాజమందిరం నుండి బయటకు రాగానే, వారు యాకోబు యోహానుతో కలిసి అంద్రెయ, సీమోనుల ఇంటికి వెళ్లారు. సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు. కాబట్టి ఆయన ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చేయి పట్టుకుని లేవనెత్తారు. జ్వరం ఆమెను వదిలిపోయింది అప్పుడు ఆమె వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు రోగాలు గలవారినందరిని దయ్యాలు పట్టినవారిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. పట్టణస్థులందరు ఆ ఇంటి ద్వారం దగ్గర కూడుకున్నారు, వివిధ రోగాలు గల అనేకులను యేసు స్వస్థపరిచారు. ఆయన అనేక దయ్యాలను వెళ్లగొట్టారు, అయితే ఆ దయ్యాలకు తాను ఎవరో తెలుసు, కాబట్టి ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. చాలా ప్రొద్దున, ఇంకా చీకటిగా ఉండగానే యేసు నిద్రలేచి, ఇంటి నుండి బయలుదేరి తాను ప్రార్థించే ఏకాంత స్థలానికి వెళ్లారు. సీమోను, అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్లి, ఆయనను కనుగొని, “అందరు నీకోసం వెదకుతున్నారు!” అని చెప్పారు. అందుకు యేసు, “మనం దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్దాం రండి, అప్పుడు నేను అక్కడ కూడా ప్రకటించగలను, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అని వారితో చెప్పారు. కాబట్టి ఆయన గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్లగొడుతూ ఉన్నారు. కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్లమీద ఉండి, “నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు వాని మీద కనికరపడ్డారు. ఆయన తన చేయి చాపి వాన్ని ముట్టి వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది, వాడు బాగయ్యాడు. వెంటనే యేసు: “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకుని వారికి సాక్ష్యంగా ఉండేలా నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని హెచ్చరించి వాన్ని పంపివేశారు. కాని వాడు వెళ్లి ఈ విషయాన్ని అందరితో చెప్తూ, ఆ వార్తను ప్రచురం చేశాడు. దాని ఫలితంగా యేసు ఆ పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక ఎవరు నివసించని బయట ప్రదేశాల్లో ఉన్నారు. అయినాసరే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆయన దగ్గరకు వస్తూనే ఉన్నారు.

షేర్ చేయి
Read మార్కు 1