మార్కు 1
1
బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య
మత్తయి 3:1-11; లూకా 3:1-16; యోహా 1:6-8; 19-28
1దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం. 2యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది,
“ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను.
అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
3‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి,
ఆయన దారులు తిన్నగా చేయండి’
అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
4యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. 5యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు. 6యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం. 7యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు. 8“నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
9యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. 10యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు. 11అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”
యేసు ఎదుర్కొన్న పరీక్ష
మత్తయి 4:1-11; లూకా 4:1-13
12వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 13ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
గలిలయ పరిచర్య ఆరంభం
మత్తయి 4:12-17; లూకా 4:14
14యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, 15“కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు. 16ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు. 17యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు. 18వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
పేతురు అంద్రెయలకు పిలుపు
మత్తయి 4:18-22; లూకా 5:10-11; యోహా 1:35-42
19ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. 20వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
కపెర్నహూములో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం
లూకా 4:31-37
21తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు. 22ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. 23అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. 24వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. 25యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. 26ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
27ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. 28ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
పేతురు అత్త జ్వరం నయం చేయడం
మత్తయి 8:14, 15; లూకా 4:38, 39
29సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు. 30సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. 31ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇతర స్వస్థతలు
మత్తయి 8:16; లూకా 4:40-41
32సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. 33ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. 34రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
ప్రార్థన, అనేక గ్రామాల సందర్శనం
35ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. 36సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. 37ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. 38ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. 39ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
కుష్టురోగి శుద్ధి
మత్తయి 8:2-4; లూకా 5:12-14
40ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. 41యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. 42వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
43ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, 44“నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు. 45కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
మార్కు 1: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.