అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు. వాడు, “నజరేయుడవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నాడు. యేసు, “నోరుమూసుకో వాని నుండి బయటకు రా!” అని గద్దిస్తూ అన్నాడు. ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది. ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, “ఇదేమిటి? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తున్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడుకున్నారు. గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి ఆయన గురించి తెలిసిపోయింది. వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్ళారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు పరిచర్యలు చెయ్యటం మొదలు పెట్టింది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆ ఊరంతా ఆయనవున్న యింటిముందు చేరుకుంది. రకరకాల వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ప్రార్థించాడు. సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు. ఆయన్ని చూసి వాళ్ళు, “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు. యేసు సమాధానం చెబుతూ, “ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” అని అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు. ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, “మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు” అని వేడుకున్నాడు. యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే దయ చూపుతాను!” అని అంటూ అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది. అతణ్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు. కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకొ” అని గట్టిగా చెప్పాడు. కాని అతడు వెళ్ళి అందరికి చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేక పొయ్యాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేసాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.
Read మార్కు 1
వినండి మార్కు 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 1:21-45
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు