తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు. ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది. సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది. సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు. ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు. కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
Read మార్కు 1
వినండి మార్కు 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 1:21-45
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు