మత్తయి 22:23-46
మత్తయి 22:23-46 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు అదే రోజు యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. “బోధకుడా, ఒకడు సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే చెప్పాడు. అలా మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటి వాడు పెళ్లి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయాడు. కనుక అతని తమ్ముడు అతని విధవను చేసుకొన్నాడు. అలాగే రెండవవాడు, మూడవవాడు, ఏడోవాని వరకు అలాగే జరిగింది. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. అయితే, వారందరు ఆమెను పెళ్ళి చేసుకున్నారు గనుక, పునరుత్థానంలో ఆ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్య అవుతుంది?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కనుక మీరు పొరపాటు పడుతున్నారు. పునరుత్థానంలో ప్రజలు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. మృతుల పునరుత్థానం గురించి, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు.” అని చెప్పారు. జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని, పరిసయ్యులు అక్కడికి చేరుకున్నారు. వారిలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు, యేసును పరీక్షిస్తూ, “బోధకుడా, ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి’ ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించాలి.’ ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తల మాటలకు ఆధారంగా ఉన్నాయి” అని అతనితో చెప్పారు. పరిసయ్యులు ఒకచోట కూడి ఉన్నప్పుడు యేసు వారిని ఈ విధంగా అడిగారు, “క్రీస్తును గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అందుకు వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు. అందుకాయన, “అలాగైతే దావీదు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనను ‘ప్రభువు’ అని ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు ఇలా అన్నాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’ దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిస్తే, ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు. ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పలేకపోయారు, మరియు ఆ రోజు నుండి ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.
మత్తయి 22:23-46 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, “బోధకా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు గదా. మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు. ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు. వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు. అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు. పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు. చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’ అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు. ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు. వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి, “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. అందుకు యేసు, “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే. ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ. ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే. ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు. మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని, “క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు. వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు. అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు. ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.
మత్తయి 22:23-46 పవిత్ర బైబిల్ (TERV)
అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?” యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.” ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు. యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి. ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’ ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.” పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు. “దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు, ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా, నా కుడి వైపు కూర్చో’ అని అనలేదా? దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?” ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.
మత్తయి 22:23-46 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి – బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను; మాలో ఏడుగురు సహోదరు లుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. రెండవవాడును మూడవవాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు–లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు. మృతుల పునరుత్థానమునుగూర్చి–నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోప దేశకుడు ఆయనను శోధించుచు –బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందు కాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి –క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు– ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన–ఆలాగైతే –నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.