మత్తయిత 22:23-46

మత్తయిత 22:23-46 TERV

అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?” యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.” ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు. యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి. ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’ ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.” పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు. “దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు, ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా, నా కుడి వైపు కూర్చో’ అని అనలేదా? దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?” ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.