పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు అదే రోజు యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు. “బోధకుడా, ఒకడు సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే చెప్పాడు. అలా మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటి వాడు పెళ్లి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయాడు. కనుక అతని తమ్ముడు అతని విధవను చేసుకొన్నాడు. అలాగే రెండవవాడు, మూడవవాడు, ఏడోవాని వరకు అలాగే జరిగింది. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. అయితే, వారందరు ఆమెను పెళ్ళి చేసుకున్నారు గనుక, పునరుత్థానంలో ఆ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్య అవుతుంది?” అని ఆయనను అడిగారు.
అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కనుక మీరు పొరపాటు పడుతున్నారు. పునరుత్థానంలో ప్రజలు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు పరలోకంలో దూతల్లా ఉంటారు. మృతుల పునరుత్థానం గురించి, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు.” అని చెప్పారు.
జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని, పరిసయ్యులు అక్కడికి చేరుకున్నారు. వారిలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు, యేసును పరీక్షిస్తూ, “బోధకుడా, ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.
అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి’ ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించాలి.’ ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తల మాటలకు ఆధారంగా ఉన్నాయి” అని అతనితో చెప్పారు.
పరిసయ్యులు ఒకచోట కూడి ఉన్నప్పుడు యేసు వారిని ఈ విధంగా అడిగారు, “క్రీస్తును గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?”
అందుకు వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.
అందుకాయన, “అలాగైతే దావీదు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనను ‘ప్రభువు’ అని ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు ఇలా అన్నాడు,
“ ‘నేను నీ శత్రువులను
నీకు పాదపీఠంగా చేసే వరకు
“నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని
ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’
దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిస్తే, ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు. ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పలేకపోయారు, మరియు ఆ రోజు నుండి ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.