మత్తయి 22:23-46

మత్తయి 22:23-46 TELUBSI

పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి – బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను; మాలో ఏడుగురు సహోదరు లుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. రెండవవాడును మూడవవాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు–లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు. మృతుల పునరుత్థానమునుగూర్చి–నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోప దేశకుడు ఆయనను శోధించుచు –బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందు కాయన–నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువు ను ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి –క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు– ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన–ఆలాగైతే –నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.