మత్తయి 21:1-22

మత్తయి 21:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునపరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగునపరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు–ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము–ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి– నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, –దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి –వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు– వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బసచేసెను. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను. శిష్యులదిచూచి ఆశ్చర్యపడి–అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

షేర్ చేయి
Read మత్తయి 21

మత్తయి 21:1-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే గ్రామానికి వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, గాడిదపిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైన అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అతడు వెంటనే వాటిని పంపుతారు” అని చెప్పి వారిని పంపారు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది: “ ‘ఇదిగో, గాడిద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారి చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నారు,’ అని సీయోను కుమారితో చెప్పండి.” శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను, దాని పిల్లను తీసుకువచ్చి వాటి మీద తమ వస్త్రాలను వేశారు, ఆయన వాటి మీద కూర్చున్నారు. ఒక గొప్ప జనసమూహం తమ బట్టలను దారి అంతటా పరచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి అంతటా పరచారు. ఆయన ముందు వెళ్లే జనసమూహం మరియు ఆయనను వెంబడించేవారు బిగ్గరగా, “దావీదు కుమారునికి హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!” “సర్వోన్నతమైన స్థలాలలో హోసన్నా!” అని కేకలు వేశారు. యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, పట్టణమంతా కలవరపడి “ఈయన ఎవరు?” అని అడిగారు. అందుకు ఆ జనసమూహం, “ఈయన యేసు, గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి వచ్చిన ప్రవక్త” అని జవాబిచ్చారు. యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్న వారినందరిని తరిమివేశారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేసారు. ఆయన వారితో, “ ‘నా మందిరం ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు. గ్రుడ్డివారు, కుంటివారు, దేవాలయంలో ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారందరిని స్వస్థపరిచారు. అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన చేసిన అద్బుతాలను, “దావీదు కుమారునికి, హోసన్నా” అని దేవాలయ ఆవరణంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. వారు ఆయనను, “వీరు చెప్తున్నది వింటున్నావా?” అని అడిగారు. “అవును,” యేసు ఈ విధంగా జవాబిచ్చారు, “ ‘ప్రభువా, చిన్నపిల్లల మరియు చంటిబిడ్డల పెదవుల నుండి నీ స్తుతులను పలికింపచేసావు,’ అనే ఈ మాటను మీరు ఎన్నడు చదువలేదా?” యేసు వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియ గ్రామానికి వెళ్లి, ఆ రాత్రి ఆయన అక్కడ బస చేశారు. తెల్లవారిన తర్వాత యేసు యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయనకు ఆకలివేసింది. అప్పుడు ఆ దారి ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి, దాని దగ్గరకు వెళ్లారు కాని దానికి ఆకులు తప్ప మరేమి కనిపించలేదు, కనుక “ఇక మీదట ఎన్నడు నీకు కాయలు కాయవు” అని దానితో చెప్పగా వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు అది చూసి, ఆశ్చర్యపడ్డారు. “ఆ అంజూరపుచెట్టు అంత త్వరగా ఎలా ఎండిపోయింది?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు విశ్వాసం కలిగి అనుమానించకపోతే, ఈ అంజూరపు చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండను చూసి, ‘నీవు వెళ్లి సముద్రంలో పడిపో’ అని చెప్పితే, అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు” అని వారితో చెప్పారు.

షేర్ చేయి
Read మత్తయి 21

మత్తయి 21:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి, “మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు” అని చెప్పి వారిని పంపించాడు. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే, “ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.” అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు. జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు. జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, “దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం” అని కేకలు వేస్తూ వచ్చారు. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, “ఎవరీయన?” అని కలవరంతో నిండిపోయింది. ఆయనతో వచ్చిన జనసమూహం, “ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త” అని వారికి జవాబిచ్చారు. యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు. వారితో ఇలా అన్నాడు, “‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు.” అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. “వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని వారితో చెప్పి ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు. తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు. అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు.

షేర్ చేయి
Read మత్తయి 21

మత్తయి 21:1-22 పవిత్ర బైబిల్ (TERV)

యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.” దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది: “‘గాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు! బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’ అని సీయోను కుమారితో చెప్పండి.” శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు. “దావీదు కుమారునికి హోసన్నా! ‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’ మహోన్నతమైన స్థలములో హోసన్నా!” యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు. “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు. యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’ అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు. గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!” అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది. “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు. యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’ అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు. ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు. ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు. యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.

షేర్ చేయి
Read మత్తయి 21