మత్తయి 21:1-22

మత్తయి 21:1-22 IRVTEL

వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి, “మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు” అని చెప్పి వారిని పంపించాడు. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే, “ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.” అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు. జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు. జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, “దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం” అని కేకలు వేస్తూ వచ్చారు. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, “ఎవరీయన?” అని కలవరంతో నిండిపోయింది. ఆయనతో వచ్చిన జనసమూహం, “ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త” అని వారికి జవాబిచ్చారు. యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు. వారితో ఇలా అన్నాడు, “‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు.” అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. “వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని వారితో చెప్పి ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు. తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు. అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు.