వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే గ్రామానికి వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, గాడిదపిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని ఏమైన అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అతడు వెంటనే వాటిని పంపుతారు” అని చెప్పి వారిని పంపారు.
ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది:
“ ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద,
సాత్వికునిగా స్వారీ చేస్తూ,
నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’
అని సీయోను కుమారితో చెప్పండి.”
శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు. వారు ఆ గాడిదను, దాని పిల్లను తీసుకువచ్చి వాటి మీద తమ వస్త్రాలను వేశారు, ఆయన వాటి మీద కూర్చున్నారు. ఒక గొప్ప జనసమూహం తమ వస్త్రాలను దారి అంతటా పరచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి అంతటా పరచారు. ఆయన ముందు వెళ్లే జనసమూహం ఆయనను వెంబడించేవారు బిగ్గరగా,
“దావీదు కుమారునికి హోసన్నా!”
“ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”
“సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!”
అని కేకలు వేశారు.
యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, పట్టణమంతా కలవరపడి, “ఈయన ఎవరు?” అని అడిగారు.
అందుకు ఆ జనసమూహం, “ఈయన యేసు, గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి వచ్చిన ప్రవక్త” అని జవాబిచ్చారు.
యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరిమివేశారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు. ఆయన వారితో, “ ‘నా మందిరం ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు.
గ్రుడ్డివారు, కుంటివారు, దేవాలయంలో ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారందరిని స్వస్థపరిచారు. అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన చేసిన అద్భుతాలను, “దావీదు కుమారునికి, హోసన్నా” అని దేవాలయ ఆవరణంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.
వారు ఆయనను, “వీరు చెప్తున్నది వింటున్నావా?” అని అడిగారు.
“అవును,” యేసు ఈ విధంగా జవాబిచ్చారు,
“ ‘ప్రభువా, చిన్నపిల్లల చంటిబిడ్డల పెదవుల నుండి
మీ స్తుతులను పలికింపచేశారు’ అనే ఈ మాటను మీరు ఎన్నడు చదువలేదా?”
యేసు వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియ గ్రామానికి వెళ్లి, ఆ రాత్రి ఆయన అక్కడ బస చేశారు.
తెల్లవారిన తర్వాత యేసు యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయనకు ఆకలివేసింది. అప్పుడు ఆ దారి ప్రక్కన ఉన్న ఒక అంజూర చెట్టును చూసి, దాని దగ్గరకు వెళ్లారు కాని దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు, కాబట్టి, “ఇకమీదట ఎన్నడు నీకు కాయలు కాయవు” అని దానితో చెప్పగా వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
శిష్యులు అది చూసి, ఆశ్చర్యపడ్డారు. “ఆ అంజూర చెట్టు అంత త్వరగా ఎలా ఎండిపోయింది?” అని అడిగారు.
అందుకు యేసు, “మీరు విశ్వాసం కలిగి అనుమానించకపోతే, ఈ అంజూర చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పితే, అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు” అని వారితో చెప్పారు.