మత్తయి సువార్త 21

21
యేసు రాజుగా యెరూషలేముకు వచ్చుట
1వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే గ్రామానికి వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ, 2“మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, గాడిదపిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. 3ఎవరైనా మిమ్మల్ని ఏమైన అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అతడు వెంటనే వాటిని పంపుతారు” అని చెప్పి వారిని పంపారు.
4ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది:
5“ ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద,
సాత్వికునిగా స్వారీ చేస్తూ,
నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’
అని సీయోను కుమారితో చెప్పండి.”#21:5 జెకర్యా 9:9
6శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు. 7వారు ఆ గాడిదను, దాని పిల్లను తీసుకువచ్చి వాటి మీద తమ వస్త్రాలను వేశారు, ఆయన వాటి మీద కూర్చున్నారు. 8ఒక గొప్ప జనసమూహం తమ వస్త్రాలను దారి అంతటా పరచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి అంతటా పరచారు. 9ఆయన ముందు వెళ్లే జనసమూహం ఆయనను వెంబడించేవారు బిగ్గరగా,
“దావీదు కుమారునికి హోసన్నా!#21:9 హెబ్రీలో అర్థం “రక్షించు!” తర్వాత అది స్తుతిని వ్యక్తపరిచే పదం అయ్యింది; 15 వచనం; అలాగే మార్కు 11:9; యోహాను 12:13
“ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”#21:9 కీర్తన 118:25,26
“సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!”
అని కేకలు వేశారు.
10యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, పట్టణమంతా కలవరపడి, “ఈయన ఎవరు?” అని అడిగారు.
11అందుకు ఆ జనసమూహం, “ఈయన యేసు, గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి వచ్చిన ప్రవక్త” అని జవాబిచ్చారు.
దేవాలయంలో యేసు
12యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరిమివేశారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు. 13ఆయన వారితో, “ ‘నా మందిరం ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ”#21:13 యెషయా 56:7; యిర్మీయా 7:11 అన్నారు.
14గ్రుడ్డివారు, కుంటివారు, దేవాలయంలో ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారందరిని స్వస్థపరిచారు. 15అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన చేసిన అద్భుతాలను, “దావీదు కుమారునికి, హోసన్నా” అని దేవాలయ ఆవరణంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.
16వారు ఆయనను, “వీరు చెప్తున్నది వింటున్నావా?” అని అడిగారు.
“అవును,” యేసు ఈ విధంగా జవాబిచ్చారు,
“ ‘ప్రభువా, చిన్నపిల్లల చంటిబిడ్డల పెదవుల నుండి
మీ స్తుతులను పలికింపచేశారు’#21:16 కీర్తన 8:2 అనే ఈ మాటను మీరు ఎన్నడు చదువలేదా?”
17యేసు వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియ గ్రామానికి వెళ్లి, ఆ రాత్రి ఆయన అక్కడ బస చేశారు.
యేసు అంజూర చెట్టును శపించుట
18తెల్లవారిన తర్వాత యేసు యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయనకు ఆకలివేసింది. 19అప్పుడు ఆ దారి ప్రక్కన ఉన్న ఒక అంజూర చెట్టును చూసి, దాని దగ్గరకు వెళ్లారు కాని దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు, కాబట్టి, “ఇకమీదట ఎన్నడు నీకు కాయలు కాయవు” అని దానితో చెప్పగా వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
20శిష్యులు అది చూసి, ఆశ్చర్యపడ్డారు. “ఆ అంజూర చెట్టు అంత త్వరగా ఎలా ఎండిపోయింది?” అని అడిగారు.
21అందుకు యేసు, “మీరు విశ్వాసం కలిగి అనుమానించకపోతే, ఈ అంజూర చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పితే, అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 22మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు” అని వారితో చెప్పారు.
యేసు అధికారాన్ని ప్రశ్నించుట
23యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, ఆయన బోధిస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ప్రజానాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
24అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను. 25యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుండి కలిగింది, పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?” అని వారిని అడిగారు.
వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు. 26ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే, ప్రజలందరు యోహానును ప్రవక్త అని నమ్ముతున్నారు, కాబట్టి మనం వారికి భయపడుతున్నాం” అని తమలో తాము చర్చించుకొన్నారు.
27అందుకు వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు.
అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఈ పనులను చేస్తున్నానో మీతో చెప్పను” అన్నారు.
ఇద్దరు కుమారుల ఉపమానం
28యేసు వారితో ఇంకా మాట్లాడుతూ, “మీకు ఏమి అనిపిస్తుంది? ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మొదటి వాని దగ్గరకు వెళ్లి, ‘కుమారుడా, వెళ్లి ఈ రోజు ద్రాక్షతోటలో పని చేయి’ అని చెప్పాడు.
29“అతడు, ‘నేను వెళ్లను’ అని జవాబు ఇచ్చాడు కాని తర్వాత మనస్సు మార్చుకొని వెళ్లాడు.
30“అప్పుడు ఆ తండ్రి రెండవ కుమారుని దగ్గరకు వెళ్లి, అదే విధంగా చెప్పాడు. అప్పుడు వాడు, ‘వెళ్తాను’ అని తండ్రితో చెప్పాడు కాని వెళ్లలేదు.
31“అయితే, ఈ ఇద్దరు కుమారులలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసినవాడు?” అని యేసు వారిని అడిగారు.
అందుకు వారు, “మొదటి వాడే” అన్నారు.
అప్పుడు యేసు వారితో, “పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 32ఎలాగంటే, యోహాను నీతి మార్గాన్ని చూపించడానికి మీ దగ్గరకు వచ్చాడు, కాని మీరు అతన్ని నమ్మలేదు, కాని పన్ను వసూలు చేసేవారు వేశ్యలు అతన్ని నమ్మారు. అది చూసిన తర్వాత కూడా, మీరు పశ్చాత్తాపపడి ఆయనను నమ్మలేదు” అని చెప్పారు.
కౌలుదారుల ఉపమానం
33“మరొక ఉపమానం వినండి: ఒక యజమాని తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు. 34కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.
35“ఆ రైతులు అతని దాసులను పట్టుకున్నారు; వారు ఒకని కొట్టారు, ఒకని చంపారు, మరొకని మీద రాళ్లు విసిరారు. 36ఆ యజమాని ఇతర దాసులను, మొదటిసారి కంటే ఎక్కువ మంది పంపాడు, ఆ కౌలు రైతులు వీరిని కూడా ముందు చేసినట్టే చేశారు. 37చివరికి ఆ యజమాని, ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుని వారి దగ్గరకు పంపాడు.
38“కాని ఆ కౌలు రైతులు కుమారుని చూసి ‘ఇతడే వారసుడు, రండి ఇతన్ని చంపి ఇతని వారసత్వాన్ని తీసుకుందాం’ అని తమలో తాము చెప్పుకొన్నారు. 39కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.
40“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ కౌలురైతులను ఏమి చేస్తాడు?”
41అందుకు, “ఆ దుష్టులను కఠినంగా నిర్మూలం చేస్తాడు, కోతకాలంలో తనకు రావలసిన పంటను సక్రమంగా చెల్లించే వేరే కౌలురైతులకు ఆ ద్రాక్షతోటను అద్దెకు ఇస్తాడు” అని వారు జవాబిచ్చారు.
42అయితే యేసు వారితో, “లేఖనాల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడు చదువలేదా:
“ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి
మూలరాయి అయ్యింది.
ఇది ప్రభువే చేశారు,
ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’#21:42 కీర్తన 118:22,23
43“కాబట్టి దేవుని రాజ్యం మీ నుండి తీసివేసి, ఆయన దానిని ఫలింపచేసే ప్రజలకు ఇస్తాడు అని మీతో చెప్తున్నాను. 44ఈ రాయి మీద పడినవారు ముక్కలైపోతారు గాని ఎవరి మీద ఈ రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.#21:44 కొ.ప్ర.లలో 44 వచనం లేదు
45ముఖ్య యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానాలను విని, ఆయన తమ గురించే చెప్పారని గ్రహించారు. 46కాబట్టి వారు ఆయనను బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు, కాని ప్రజలు ఆయనను ప్రవక్త అని భావించడంతో వారికి భయపడ్డారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మత్తయి సువార్త 21: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి