మత్తయిత 21:1-22

మత్తయిత 21:1-22 TERV

యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.” దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది: “‘గాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు! బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’ అని సీయోను కుమారితో చెప్పండి.” శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు. “దావీదు కుమారునికి హోసన్నా! ‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’ మహోన్నతమైన స్థలములో హోసన్నా!” యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు. “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు. యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’ అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు. గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!” అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది. “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు. యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’ అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు. ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు. ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు. యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.