లూకా 20:27-47

లూకా 20:27-47 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు, యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు, “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మా కొరకు వ్రాసాడు. అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సహోదరులు ఉన్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయాడు. రెండవవాడు, అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయారు. ఈ విధంగా ఏడుగురు ఆమెను పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయారు. తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు, కనుక పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు. అందుకు యేసు, “ఈ యుగానికి చెందినవారు పెళ్ళి చేసుకొంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు గాని మృతుల పునరుత్థానం పొంది రానున్న యుగానికి యోగ్యులుగా ఎంచబడేవారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు ఎన్నడు చావనే చావరు. దూతల్లా ఉంటారు. వారు పునరుత్థాన సంతానంగా దేవుని పిల్లలు అవుతారు. అయితే మృతులు తిరిగి లేచే విషయం చెప్తూ ఇలా అన్నారు: మండుచున్న పొద సంఘటనలో మోషే ‘మన పూర్వికులైన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు’ అని చెప్తూ మృతులు లేస్తారని సూచించాడు. ఆయన దృష్టిలో అందరు జీవించేవున్నారు కనుక ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు.” అని వారికి జవాబిచ్చారు. ధర్మశాస్త్ర ఉపదేశకులలో కొందరు, “బోధకుడా, నీవు చాలా బాగా చెప్పావు” అని అన్నారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు. యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? దావీదే స్వయంగా కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాసాడు: “ ‘నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’ దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అన్నారు. ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో, “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు పొడుగు అంగీలు వేసుకొని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను మరియు విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు. వారు విధవరాళ్ళ గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.

షేర్ చేయి
Read లూకా 20

లూకా 20:27-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు. “బోధకా, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే, అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే మనకు రాసి ఇచ్చాడు కదా, ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు. రెండవవాడు, మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు. ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు. ఆ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది? ఇక్కడ ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా” అన్నారు. అందుకు యేసు, “ఈ లోక ప్రజలు పెళ్ళికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ, పరలోకంలో నిత్యజీవానికీ, మృతుల పునరుత్థానానికీ అర్హులు ఆ కాలంలో పెళ్ళి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు. వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు. మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా, ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ సజీవులే” అని వారికి జవాబిచ్చాడు. ఆ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు, “బోధకా, చాలా బాగా చెప్పావు” అన్నారు. ఆయన వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు? “నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ, నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు,” అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు?” అన్నాడు. ప్రజలందరూ వింటుండగా ఆయన, “శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతూ ఉండాలని చూస్తారు. వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు. వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు” అని తన శిష్యులతో చెప్పాడు.

షేర్ చేయి
Read లూకా 20

లూకా 20:27-47 పవిత్ర బైబిల్ (TERV)

చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు: “బోధకుడా! మోషే ‘ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి’ అని వ్రాశాడు. ఒక్కప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణించాడు. మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు. చివరకు ఆమెకూడా మరణించింది. మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది?” అని అడిగారు. యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు. పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు. వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’ అని వ్రాసాడు. ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు. కొందరు శాస్త్రులు, “బోధకుడా! చక్కగా చెప్పారు” అని అన్నారు. ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు కదా! ‘ప్రభువు నా ప్రభువుతో: నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకూ నా కుడి వైపు కూర్చో’ దావీదు ఆయన్ని ‘ప్రభూ!’ అని అన్నాడు కదా! అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అని అన్నాడు. ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు. వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”

షేర్ చేయి
Read లూకా 20

లూకా 20:27-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. –బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను. యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్ర్తీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. ఆప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్ర్తీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు–ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు. పొదనుగురించిన భాగములో –ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు–బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారితో–క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు– నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 20

లూకా 20:27-47 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు, యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు, “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు. అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సహోదరులు ఉన్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. రెండవవాడు, అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు. అందుకు యేసు, “ఈ యుగానికి చెందినవారు పెళ్ళి చేసుకొంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు గాని మృతుల పునరుత్థానం పొంది రానున్న యుగానికి యోగ్యులుగా ఎంచబడేవారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు ఎన్నడు చావనే చావరు. దూతల్లా ఉంటారు. వారు పునరుత్థాన సంతానంగా దేవుని పిల్లలు అవుతారు. అయితే మృతులు తిరిగి లేచే విషయం చెప్తూ ఇలా అన్నారు: మండుతున్న పొద సంఘటనలో మోషే, ‘అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు’ అని చెప్తూ మృతులు లేస్తారని సూచించాడు. ఆయన దృష్టిలో అందరు జీవించే ఉన్నారు కాబట్టి ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని వారికి జవాబిచ్చారు. ధర్మశాస్త్ర ఉపదేశకులలో కొందరు, “బోధకుడా, నీవు చాలా బాగా చెప్పావు” అని అన్నారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు. యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? దావీదే స్వయంగా కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాశాడు: “ ‘నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’ దావీదే ఆయనను, ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో, “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు. వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.

షేర్ చేయి
Read లూకా 20