లూకా సువార్త 20:27-47

లూకా సువార్త 20:27-47 OTSA

పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు, యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు, “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు. అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సహోదరులు ఉన్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. రెండవవాడు, అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు. అందుకు యేసు, “ఈ యుగానికి చెందినవారు పెళ్ళి చేసుకొంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు గాని మృతుల పునరుత్థానం పొంది రానున్న యుగానికి యోగ్యులుగా ఎంచబడేవారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు ఎన్నడు చావనే చావరు. దూతల్లా ఉంటారు. వారు పునరుత్థాన సంతానంగా దేవుని పిల్లలు అవుతారు. అయితే మృతులు తిరిగి లేచే విషయం చెప్తూ ఇలా అన్నారు: మండుతున్న పొద సంఘటనలో మోషే, ‘అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు’ అని చెప్తూ మృతులు లేస్తారని సూచించాడు. ఆయన దృష్టిలో అందరు జీవించే ఉన్నారు కాబట్టి ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని వారికి జవాబిచ్చారు. ధర్మశాస్త్ర ఉపదేశకులలో కొందరు, “బోధకుడా, నీవు చాలా బాగా చెప్పావు” అని అన్నారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు. యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది? దావీదే స్వయంగా కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాశాడు: “ ‘నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’ దావీదే ఆయనను, ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో, “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు. వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.