లూకా 20:27-47

లూకా 20:27-47 TELUBSI

పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. –బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను. యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్ర్తీని పెండ్లి చేసికొని సంతానము లేక చనిపోయెను. రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. ఆప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్ర్తీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు–ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు. పొదనుగురించిన భాగములో –ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు–బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారితో–క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు– నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను–శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.