పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు. “బోధకా, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే, అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే మనకు రాసి ఇచ్చాడు కదా, ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు. రెండవవాడు, మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు. ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు. ఆ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది? ఇక్కడ ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా” అన్నారు. అందుకు యేసు, “ఈ లోక ప్రజలు పెళ్ళికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ, పరలోకంలో నిత్యజీవానికీ, మృతుల పునరుత్థానానికీ అర్హులు ఆ కాలంలో పెళ్ళి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు. వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు. మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా, ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ సజీవులే” అని వారికి జవాబిచ్చాడు. ఆ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు, “బోధకా, చాలా బాగా చెప్పావు” అన్నారు. ఆయన వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు? “నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ, నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు,” అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు?” అన్నాడు. ప్రజలందరూ వింటుండగా ఆయన, “శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతూ ఉండాలని చూస్తారు. వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందుల్లో అగ్ర స్థానాలను ఆశిస్తారు. వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు” అని తన శిష్యులతో చెప్పాడు.
Read లూకా 20
వినండి లూకా 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 20:27-47
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు