లూకా 2:21-32

లూకా 2:21-32 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆ శిశువుకు సున్నతి చేయాల్సిన ఎనిమిదవ రోజున, ఆయనను గర్భం దాల్చక ముందు దేవదూత చెప్పినట్లు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత, యోసేపు మరియలు ఆ శిశువును ప్రభువునకు ప్రతిష్ఠించడానికి యెరూషలేముకు తీసుకువెళ్ళారు. (ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లుగా, “ప్రతి తొలి మగబిడ్డ ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి”), మరియు ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: “గువ్వల జతను, లేక రెండు చిన్న పావురాలను” బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళారు. ఆ సమయంలో యెరూషలేములో నీతిమంతుడు మరియు భక్తిపరుడైన, సుమెయోను అని పిలువబడే ఒక వృద్ధుడున్నాడు. అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది. అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు, సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకొని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు: “ సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు. ఎందుకంటే నా కళ్ళు నీ రక్షణను చూసాయి, దేన్నైతే సర్వలోక ప్రజల కొరకు నీవు సిద్ధపరచావో: యూదులు కాని వారందరికి ప్రత్యక్షత కొరకైన వెలుగుగా, మరియు నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా.”

షేర్ చేయి
Read లూకా 2

లూకా 2:21-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు. యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు. సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు, “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా! అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”

షేర్ చేయి
Read లూకా 2

లూకా 2:21-32 పవిత్ర బైబిల్ (TERV)

ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు. ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి” అని వ్రాయబడి ఉంది. అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు. ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు: “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు. నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను. నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు! యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”

షేర్ చేయి
Read లూకా 2

లూకా 2:21-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రముచొప్పునవారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు –ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు కు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయిరి. యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మ వశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను – –నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.

షేర్ చేయి
Read లూకా 2

లూకా 2:21-32 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఆ శిశువుకు సున్నతి చేయాల్సిన ఎనిమిదవ రోజున, ఆయనను గర్భం దాల్చక ముందు దేవదూత చెప్పినట్లు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత, యోసేపు మరియలు ఆ శిశువును ప్రభువునకు ప్రతిష్ఠించడానికి యెరూషలేముకు తీసుకెళ్లారు. (ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లుగా, “ప్రతి తొలి మగబిడ్డ ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి”), ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: “గువ్వల జతను, లేదా రెండు చిన్న పావురాలను” బలిగా అర్పించడానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో యెరూషలేములో నీతిమంతుడు భక్తిపరుడైన, సుమెయోను అని పిలువబడే ఒక వృద్ధుడున్నాడు. అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది. అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు, సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకుని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు: “సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు. సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన, నీ రక్షణను నా కళ్లారా చూశాను, అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.”

షేర్ చేయి
Read లూకా 2