లూకా 2:21-32

లూకా 2:21-32 TERV

ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు. ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి” అని వ్రాయబడి ఉంది. అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు. ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు: “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు. నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను. నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు! యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”