లూకా 2:21-32

లూకా 2:21-32 IRVTEL

ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు. యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు. సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు, “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా! అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”