లూకా సువార్త 2:21-32

లూకా సువార్త 2:21-32 OTSA

ఆ శిశువుకు సున్నతి చేయాల్సిన ఎనిమిదవ రోజున, ఆయనను గర్భం దాల్చక ముందు దేవదూత చెప్పినట్లు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత, యోసేపు మరియలు ఆ శిశువును ప్రభువునకు ప్రతిష్ఠించడానికి యెరూషలేముకు తీసుకెళ్లారు. (ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లుగా, “ప్రతి తొలి మగబిడ్డ ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి”), ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: “గువ్వల జతను, లేదా రెండు చిన్న పావురాలను” బలిగా అర్పించడానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో యెరూషలేములో నీతిమంతుడు భక్తిపరుడైన, సుమెయోను అని పిలువబడే ఒక వృద్ధుడున్నాడు. అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది. అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు, సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకుని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు: “సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు. సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన, నీ రక్షణను నా కళ్లారా చూశాను, అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.”