లూకా 13:22-30
లూకా 13:22-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచా రము చేయుచుండెను. ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి–ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి–అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు ఆయన–మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు. అప్పుడాయన– మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమముచేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును. అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
లూకా 13:22-30 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ తర్వాత యేసు పట్టణాలు, గ్రామాల గుండా బోధిస్తూ, యెరూషలేముకు వెళ్లారు. అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రతీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే, చాలామంది ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కాని ప్రవేశించలేరు అని మీకు చెప్తున్నాను. ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మా కొరకు తలుపు తెరవండి’ అని వేడుకొంటారు. “కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు. “అప్పుడు మీరు, ‘మేము నీతో కలిసి తిన్నాము త్రాగాము, నీవు మా వీధుల్లో బోధించావు’ అని అంటారు. “కాని అతడు, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అంటాడు. “మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తలందరిని దేవుని రాజ్యంలో చూస్తారు, కానీ మీరు మాత్రం వెలుపటికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం, పండ్లు కొరకడం ఉంటాయి. ప్రజలు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి, దేవుని రాజ్యంలో జరిగే విందులో తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. వాస్తవానికి చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు.”
లూకా 13:22-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు. ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు. దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను. ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే ఆయన, ‘మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు’ అని మీతో అంటాడు. అప్పుడు మీరు, ‘నీ ఎదుటనే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా’ అంటారు. అప్పుడు ఆయన, ‘మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేసేవారు. నా దగ్గరనుంచి పొండి’ అంటాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు. ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు. ఇదిగో వినండి, చివరి వారు మొదటి వారవుతారు, అలాగే మొదటివారు చివరి వారవుతారు.”
లూకా 13:22-30 పవిత్ర బైబిల్ (TERV)
యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు. ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు. అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు. కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు. “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.