లూకా 13:22-30

లూకా 13:22-30 TERV

యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు. ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు. అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు. కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు. “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.