లూకా 13:22-30

లూకా 13:22-30 IRVTEL

ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు. ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు. దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను. ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే ఆయన, ‘మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు’ అని మీతో అంటాడు. అప్పుడు మీరు, ‘నీ ఎదుటనే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా’ అంటారు. అప్పుడు ఆయన, ‘మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేసేవారు. నా దగ్గరనుంచి పొండి’ అంటాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు. ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు. ఇదిగో వినండి, చివరి వారు మొదటి వారవుతారు, అలాగే మొదటివారు చివరి వారవుతారు.”