లూకా 13:22-30

లూకా 13:22-30 TCV

ఆ తర్వాత యేసు పట్టణాలు, గ్రామాల గుండా బోధిస్తూ, యెరూషలేముకు వెళ్లారు. అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రతీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే, చాలామంది ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కాని ప్రవేశించలేరు అని మీకు చెప్తున్నాను. ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మా కొరకు తలుపు తెరవండి’ అని వేడుకొంటారు. “కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు. “అప్పుడు మీరు, ‘మేము నీతో కలిసి తిన్నాము త్రాగాము, నీవు మా వీధుల్లో బోధించావు’ అని అంటారు. “కాని అతడు, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అంటాడు. “మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తలందరిని దేవుని రాజ్యంలో చూస్తారు, కానీ మీరు మాత్రం వెలుపటికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం, పండ్లు కొరకడం ఉంటాయి. ప్రజలు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి, దేవుని రాజ్యంలో జరిగే విందులో తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. వాస్తవానికి చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు.”