యెహోషువ 24:14-31
యెహోషువ 24:14-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన్ని నిష్కపటంగా నమ్మకంగా సేవించండి. యూఫ్రటీసు నది అవతల ఐగుప్తులో మీ పూర్వీకులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవానే సేవించండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు. అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు. “యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను ఎన్నడూ సేవించం. ఐగుప్తుదేశం నుండి, బానిసత్వపు ఇంట్లో నుండి మమ్మల్ని, మా పూర్వీకులను రప్పించి, మా కళ్ళముందు ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మేము చేసిన ప్రయాణమంతా, మేము వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మమ్మల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు. యెహోవా యీ దేశంలో నివసించిన అమోరీయులూ మిగతా ప్రజలందరినీ మా దగ్గరనుండి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం.” అయితే యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు. “యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మీ అపరాధాలనూ మీ పాపాలనూ క్షమించడు. మీరాయన్ని సేవించలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవుళ్ళను సేవిస్తే ఆయన తన మనస్సు తిప్పుకుని మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మీకు మేలు చేసిన తరువాత మిమ్మల్ని నాశనం చేస్తాడు.” అప్పుడు ప్రజలు “అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాం” అని యెహోషువతో అన్నారు. అప్పుడు యెహోషువ “మీరు యెహోవానే సేవిస్తామని ఆయన్ని కోరుకున్నందుకు మీ గురించి మీరే సాక్షులు” అన్నాడు. వారు “మేమే సాక్షులం” అన్నారు. అందుకతడు “అలాగైతే మీ మధ్య ఉన్న అన్యదేవుళ్ళను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు మీ హృదయాలను తిప్పుకోండి” అన్నాడు. ప్రజలు “మన దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం” అని యెహోషువతో చెప్పారు. యెహోషువ ఆ రోజు ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెంలో కట్టడలనూ విధులనూ నియమించాడు. దేవుని ధర్మశాస్త్రగ్రంథంలో ఈ మాటలు రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోషువ పరిశుద్ధస్థలం లో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలబెట్టాడు. యెహోషువ ప్రజలందరితో “గమనించండి, యెహోషువ మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. కాబట్టి అది మనమీద సాక్షిగా ఉంటుంది. మీరు మీ దేవుని విసర్జిస్తే అది మీ మీద సాక్షిగా ఉంటుంది” అన్నాడు. అప్పుడు యెహోషువ ప్రజలను ఎవరి స్వాస్థ్యానికి వారిని పంపివేశాడు. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు, యెహోవా సేవకుడు అయిన యెహోషువ 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అతడు స్వాస్థ్యంగా పొందిన ప్రాంతపు భూమి, తిమ్నత్సెరహులో వారతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిమీయుల కొండప్రాంతంలోని గాయషు కొండకు ఉత్తరంగా ఉంది. యెహోషువ బతికిన కాలమంతా, యెహోషువ తరువాత యింకా బతికి యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేసిన పనులన్నీ ఎరిగిన పెద్దల కాలమంతా ఇశ్రాయేలీయులు యెహోవాను సేవిస్తూ వచ్చారు.
యెహోషువ 24:14-31 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం క్రిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి. “అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!” అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము. మన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర దేశాలగుండా మనము ప్రయాణించినప్పుడు ఆయనే మనలను కాపాడాడు. తర్వాత ఈ దేశాల్లో నివసించే ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు గనుక.” అప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను దేవుడు మీకు సంభవింపజేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.” అయితే ప్రజలు, “లేదు, మేము యెహోవానే సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు. అప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి. మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు తెలుసా, మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” అన్నాడు. ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ తెలుసు” అని జవాబిచ్చారు. అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమవుతాము” అని యెహోషువతో చెప్పారు. కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టముగా చేసాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది. దేవుని ధర్మశాస్త్రపు గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ వ్రాసాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండను చూసాడు. (ఈ బండ ఈ ఒడంబడికకు ఋజువు) యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం క్రింద ఆ బండను అతడు పెట్టాడు. అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు: “ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది. కనుక ఈ వేళ జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీమీద ఈ బండ సాక్షి. మీ దేవుడైన యెహోవాకు మీరు విరోధంగా తిరుగకుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది.” అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తీ తన స్వంత స్థలానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ చనిపోయాడు. ఆయన వయస్సు నూటపది సంవత్సరాలు. తిమ్నాత్ సెరహులోని తన స్వంత స్థలంలో యెహోషువ పాతిపెట్టబడ్డాడు. ఇది గాయషుకొండకు ఉత్తరాన ఎఫ్రాయిం దేశంలో ఉంది. యెహోషువ జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ మరణం తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవించారు. తమ నాయకులు బ్రతికి ఉన్నంతవరకు ప్రజలు యెహోవాను సేవించటం కొనసాగించారు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసినవాటిని చూసినవారు ఈ నాయకులు.
యెహోషువ 24:14-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీపితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు–యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక. ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచకక్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజలందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ–యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింప లేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలుచేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా జనులు–అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ–మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మునుగూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారు–మేము సాక్షులమే అనిరి. అందుకతడు– ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు–మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములోనున్న సింధూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను–ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినయెడల అది మీమీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను. ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.
యెహోషువ 24:14-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఇప్పుడు యెహోవాకు భయపడి పూర్తి నమ్మకత్వంతో ఆయనను సేవించండి. యూఫ్రటీసు నది అవతల, ఈజిప్టులో మీ పూర్వికులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను సేవించండి. అయితే యెహోవాను సేవించడం మీకు అయిష్టంగా అనిపిస్తే మీరు ఎవరిని సేవించాలో, యూఫ్రటీసు నది అవతల మీ పూర్వికులు సేవించిన దేవుళ్ళను సేవించాలో లేదా మీరు నివసిస్తున్న అమోరీయుల దేశంలోని దేవుళ్ళను సేవించాలో ఈ రోజు ఎంచుకోండి. అయితే నేనూ, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము.” అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక! మమ్మల్ని, మా తల్లిదండ్రులను దాస్య దేశమైన ఈజిప్టు నుండి రప్పించి, మన కళ్లముందు ఆ గొప్ప సూచకక్రియలను చేసింది మన దేవుడైన యెహోవాయే. మా మొత్తం ప్రయాణంలో, మేము ప్రయాణించిన అన్ని దేశాల మధ్య ఆయన మమ్మల్ని రక్షించాడు. ఆ దేశంలో నివసించే అమోరీయులతో సహా ప్రజలందరినీ యెహోవా మన ముందు వెళ్లగొట్టారు. కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.” యెహోషువ ప్రజలతో, “మీరు యెహోవాను సేవించలేరు. ఆయన పరిశుద్ధ దేవుడు; ఆయన రోషం గల దేవుడు. మీ తిరుగుబాటును, మీ పాపాలను ఆయన క్షమించడు. ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తే, ఆయన మీకు మేలు చేసినట్టే మీ మీదికి కీడు తెచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు.” అయితే ప్రజలు యెహోషువతో, “లేదు! మేము యెహోవానే సేవిస్తాం” అన్నారు. అప్పుడు యెహోషువ, “మీరు యెహోవాను సేవించడానికి ఎంచుకున్నందుకు మీకు మీరే సాక్షులు” అని అన్నాడు. అందుకు వారు, “అవును, మేము సాక్షులం” అని చెప్పారు. “అలా అయితే, ఇప్పుడు మీ మధ్యనున్న ఇతర దేవుళ్ళను పారవేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మీ హృదయాలను అప్పగించుకోండి” అని యెహోషువ చెప్పాడు. ప్రజలు యెహోషువతో, “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయనకే లోబడతాం” అన్నారు. ఆ రోజున యెహోషువ ప్రజల కోసం ఒక ఒడంబడిక చేసి షెకెములో వారి కోసం శాసనాలను, చట్టాలను నియమించాడు. యెహోషువ ఈ విషయాలను దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో నమోదు చేసి ఒక పెద్ద రాయిని తీసుకుని దానిని యెహోవా పవిత్ర స్థలం దగ్గర సింధూర వృక్షం క్రింద ప్రతిష్ఠించాడు. యెహోషువ ప్రజలందరితో, “చూడండి! ఈ రాయి మనమీద సాక్షిగా ఉంటుంది. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ అది విన్నది. మీరు మీ దేవుని విడిచిపెడితే అది మీమీద సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు. ఆ తర్వాత యెహోషువ ప్రజలను ఎవరి వారసత్వానికి వారిని పంపివేశాడు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత, నూను కుమారుడు, యెహోవా సేవకుడునైన యెహోషువ నూట పదేళ్ల వయస్సులో చనిపోయాడు. ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని గాయషు పర్వతానికి ఉత్తరాన ఉన్న తిమ్నాత్ సెరహులో అతనికి వారసత్వంగా వచ్చిన దేశంలో వారు అతన్ని పాతిపెట్టారు. యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన ప్రతి కార్యాన్ని అనుభవించిన పెద్దలు ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు.