యెహోషువ 24

24
1యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరిని షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. 2యెహోషువ జనులందరితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా చెప్పునదేమనగా–ఆదికాలమునుండి మీపితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి. 3అయితే నేను నది అద్దరినుండి మీపితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చితిని. 4ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి. 5తరువాత నేను మోషే అహరోనులను పంపి, దానిమధ్యను నేను చేసిన క్రియలవలన ఐగుప్తీయులను హతముచేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. 6నేను ఐగుప్తులోనుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎఱ్ఱసముద్రమువరకు తరిమిరి. 7వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి. 8యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధముచేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి, వారు మీ యెదుట నిలువకుండ వారిని నశింపజేసితిని. 9తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా 10నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతనిచేతినుండి నేనే మిమ్మును విడిపించితిని. 11మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హిత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధముచేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని. 12మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లుకాదుగాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యముచేయని దేశమును 13మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు. 14కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీపితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. 16అందుకు ప్రజలు–యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక. 17ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచకక్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజలందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. 18యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి.
19అందుకు యెహోషువ–యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింప లేరు. 20మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలుచేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా 21జనులు–అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి. 22అప్పుడు యెహోషువ–మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మునుగూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారు–మేము సాక్షులమే అనిరి. 23అందుకతడు– ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. 24అందుకు జనులు–మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి.
25అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి 26దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములోనున్న సింధూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి 27జనులందరితో ఇట్లనెను–ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినయెడల అది మీమీద సాక్షిగా ఉండును. 28అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను.
29ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను. 30అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది.
31యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. 32ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. 33మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 24: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యెహోషువ 24