యెహోషువ 24

24
షెకెములో ఒడంబడిక పునరుద్ధరణ
1తర్వాత యెహోషువ ఇశ్రాయేలు గోత్రాలన్నిటిని షెకెములో సమావేశపరిచాడు. అతడు ఇశ్రాయేలు పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, అధికారులను పిలిపించాడు, వారు వచ్చి దేవుని ముందు నిలబడ్డారు.
2యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘చాలా కాలం క్రితం అబ్రాహాము, నాహోరుల తండ్రియైన తెరహుతో సహా మీ పూర్వికులు యూఫ్రటీసు నది అవతల నివసించి ఇతర దేవుళ్ళను ఆరాధించారు. 3అయితే నేను మీ తండ్రి అబ్రాహామును యూఫ్రటీసు అవతల ఉన్న దేశం నుండి తీసుకువచ్చి కనానుకు నడిపించి, అతనికి చాలామంది సంతానాన్ని ఇచ్చాను. అయితే నేను అతనికి ఇస్సాకును ఇచ్చాను, 4ఇస్సాకుకు యాకోబును, ఏశావును ఇచ్చాను. నేను శేయీరు కొండ ప్రాంతాన్ని ఏశావుకు స్వాధీనపరచుకోడానికి ఇచ్చాను, అయితే యాకోబు, అతని కుటుంబం ఈజిప్టుకు వెళ్లిపోయారు.
5“ ‘నేను మోషే అహరోనులను పంపి, అక్కడ నేను చేసిన కార్యాలతో ఈజిప్టువారిని బాధపెట్టి, మిమ్మల్ని బయటకు రప్పించాను. 6నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరకు వచ్చారు. ఈజిప్టువారు రథాలతో, గుర్రాలతో#24:6 లేదా రథసారధులతో ఎర్ర సముద్రం వరకు వారిని వెంటాడారు. 7అయితే వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా ఆయన మీకు, ఈజిప్టువారికి మధ్య చీకటిని కలిగించి, సముద్రాన్ని వారి మీదికి తెచ్చి వారిని కప్పివేశారు. నేను ఈజిప్టువారికి ఏమి చేశానో మీరు మీ కళ్లతో చూశారు. అప్పుడు మీరు చాలా కాలం అరణ్యంలో నివసించారు.
8“ ‘యొర్దానుకు తూర్పు వైపున ఉండే అమోరీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడు వారు మీతో యుద్ధం చేశారు గాని, నేను వారిని మీ చేతికప్పగించాను. నేను వారిని మీ ముందు ఉండకుండా నాశనం చేయగా మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. 9మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలుతో యుద్ధానికి సిద్ధపడి మిమ్మల్ని శపించమని బెయోరు కుమారుడైన బిలామును పిలిపించాడు. 10అయితే నేను బిలాము మాట వినలేదు కాబట్టి అతడు మిమ్మల్ని పదే పదే ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించాను.
11“ ‘తర్వాత మీరు యొర్దాను దాటి యెరికోకు వచ్చారు. యెరికోకు యజమానులైన అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులతో కలిసి యెరికో ప్రజలు కూడా మీతో పోరాడారు, కాని నేను వారిని మీ చేతికి అప్పగించాను. 12నేను కందిరీగలను మీకు ముందుగా పంపాను. అవే ఇద్దరు అమోరీయుల రాజులను మీ ముందు నుండి తరిమివేశాయి. అంతేకాని మీ ఖడ్గం కాదు మీ విల్లు కాదు. 13కాబట్టి మీరు కష్టపడని దేశాన్ని, మీరు కట్టని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవతోటల నుండి పండ్లు తింటున్నారు.’
14“ఇప్పుడు యెహోవాకు భయపడి పూర్తి నమ్మకత్వంతో ఆయనను సేవించండి. యూఫ్రటీసు నది అవతల, ఈజిప్టులో మీ పూర్వికులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను సేవించండి. 15అయితే యెహోవాను సేవించడం మీకు అయిష్టంగా అనిపిస్తే మీరు ఎవరిని సేవించాలో, యూఫ్రటీసు నది అవతల మీ పూర్వికులు సేవించిన దేవుళ్ళను సేవించాలో లేదా మీరు నివసిస్తున్న అమోరీయుల దేశంలోని దేవుళ్ళను సేవించాలో ఈ రోజు ఎంచుకోండి. అయితే నేనూ, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము.”
16అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక! 17మమ్మల్ని, మా తల్లిదండ్రులను దాస్య దేశమైన ఈజిప్టు నుండి రప్పించి, మన కళ్లముందు ఆ గొప్ప సూచకక్రియలను చేసింది మన దేవుడైన యెహోవాయే. మా మొత్తం ప్రయాణంలో, మేము ప్రయాణించిన అన్ని దేశాల మధ్య ఆయన మమ్మల్ని రక్షించాడు. 18ఆ దేశంలో నివసించే అమోరీయులతో సహా ప్రజలందరినీ యెహోవా మన ముందు వెళ్లగొట్టారు. కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.”
19యెహోషువ ప్రజలతో, “మీరు యెహోవాను సేవించలేరు. ఆయన పరిశుద్ధ దేవుడు; ఆయన రోషం గల దేవుడు. మీ తిరుగుబాటును, మీ పాపాలను ఆయన క్షమించడు. 20ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తే, ఆయన మీకు మేలు చేసినట్టే మీ మీదికి కీడు తెచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు.”
21అయితే ప్రజలు యెహోషువతో, “లేదు! మేము యెహోవానే సేవిస్తాం” అన్నారు.
22అప్పుడు యెహోషువ, “మీరు యెహోవాను సేవించడానికి ఎంచుకున్నందుకు మీకు మీరే సాక్షులు” అని అన్నాడు.
అందుకు వారు, “అవును, మేము సాక్షులం” అని చెప్పారు.
23“అలా అయితే, ఇప్పుడు మీ మధ్యనున్న ఇతర దేవుళ్ళను పారవేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మీ హృదయాలను అప్పగించుకోండి” అని యెహోషువ చెప్పాడు.
24ప్రజలు యెహోషువతో, “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయనకే లోబడతాం” అన్నారు.
25ఆ రోజున యెహోషువ ప్రజల కోసం ఒక ఒడంబడిక చేసి షెకెములో వారి కోసం శాసనాలను, చట్టాలను నియమించాడు. 26యెహోషువ ఈ విషయాలను దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో నమోదు చేసి ఒక పెద్ద రాయిని తీసుకుని దానిని యెహోవా పవిత్ర స్థలం దగ్గర సింధూర వృక్షం క్రింద ప్రతిష్ఠించాడు.
27యెహోషువ ప్రజలందరితో, “చూడండి! ఈ రాయి మనమీద సాక్షిగా ఉంటుంది. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ అది విన్నది. మీరు మీ దేవుని విడిచిపెడితే అది మీమీద సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు.
28ఆ తర్వాత యెహోషువ ప్రజలను ఎవరి వారసత్వానికి వారిని పంపివేశాడు.
వాగ్దాన భూమిలో పాతిపెట్టబడుట
29ఈ సంఘటనలు జరిగిన తర్వాత, నూను కుమారుడు, యెహోవా సేవకుడునైన యెహోషువ నూట పదేళ్ల వయస్సులో చనిపోయాడు. 30ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని గాయషు పర్వతానికి ఉత్తరాన ఉన్న తిమ్నాత్ సెరహులో అతనికి వారసత్వంగా వచ్చిన దేశంలో వారు అతన్ని పాతిపెట్టారు.
31యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన ప్రతి కార్యాన్ని అనుభవించిన పెద్దలు ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు.
32ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. యాకోబు దానిని షెకెము తండ్రియైన హమోరు కుమారుల నుండి వంద వెండి నాణేలకు#24:32 హెబ్రీలో కెసిటా; అనేది తెలియని బరువు, విలువ కలిగిన డబ్బు యొక్క తూకం కొన్నాడు. ఇది యోసేపు వారసుల వారసత్వంగా మారింది.
33అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయిం కొండసీమల్లో అతని కుమారుడైన ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 24: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహోషువ 24 కోసం వీడియో