యెహోషువ 24:14-31

యెహోషువ 24:14-31 TELUBSI

కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీపితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు–యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక. ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచకక్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజలందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోషువ–యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింప లేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలుచేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా జనులు–అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ–మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మునుగూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారు–మేము సాక్షులమే అనిరి. అందుకతడు– ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు–మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములోనున్న సింధూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను–ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినయెడల అది మీమీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను. ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.

యెహోషువ 24:14-31 కోసం వీడియో