అపొస్తలుల కార్యములు 16:25-40

అపొస్తలుల కార్యములు 16:25-40 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

సుమారు అర్ధరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, ప్రతి ఒక్కరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు. చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు. ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు. అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు మరియు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకొన్నారు. ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తెచ్చి వారికి భోజనం వడ్డించాడు. తాను తన ఇంటివారందరు దేవుని నమ్ముకున్నందుకు అతడు ఆనందించాడు. మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు. ఆ చెరసాల అధికారి పౌలుతో, “న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కనుక మీరు సమాధానంగా బయలుదేరండి” అని చెప్పాడు. అయితే పౌలు ఆ భటులతో, “రోమీయులమైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండానే బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపించాలని అనుకుంటున్నారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకువెళ్లాలి” అని చెప్పాడు. ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియచేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు. కనుక వారు వీరిని శాంతింప చేయడానికి వచ్చి, చెరసాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి, పట్టణం విడిచిపొమ్మని బ్రతిమలాడారు. పౌలు సీలలు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు లూదియ ఇంటికి వెళ్లారు, అక్కడ సహోదర సహోదరీలను కలిసి వారిని ప్రోత్సహించిన తర్వాత, వారు అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయారు.

అపొస్తలుల కార్యములు 16:25-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు. చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు. అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు. తెల్లవారగానే, వారిని విడిచిపెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటులను పంపారు. చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియజేసి, “మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి” అని చెప్పాడు. అయితే పౌలు వారితో “వారు న్యాయం విచారించకుండానే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకు రావాలి” అని చెప్పాడు. భటులు ఈ మాటలు న్యాయాధికారులకు తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి వారిని బతిమాలుకుని చెరసాల బయటికి తీసుకుపోయి, పట్టణం విడిచి వెళ్ళండని వారిని ప్రాధేయపడ్డారు. పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళారు. వారు సోదరులను చూసి, వారిని ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 16:25-40 పవిత్ర బైబిల్ (TERV)

అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బంధీలు వింటున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి. చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు. ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు. వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు. ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు. ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోనివాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోనివాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు. తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయమని ఆజ్ఞాపించారు. “నిన్ను, సీలను విడుదల చేయమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి!” అని చెరసాల అధికారి అన్నాడు. కాని పౌలు వాళ్ళతో, “మేము రోమా పౌరులమైనా విచారణ జరుపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు. కారాగారంలో పడవేసారు. కాని యిప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు. భటులు ఈ వార్త అధికారులకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీల రోమా పౌరులని విని భయపడిపోయారు. అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించమని వేడుకొన్నారు. వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు. పౌలు, సీల కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 16:25-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు–ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడీమాటలు పౌలునకు తెలిపి–మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. అయితే పౌలు–వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి, వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి – పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలోనుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.

అపొస్తలుల కార్యములు 16:25-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు. చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు. ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు. అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకున్నారు. ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తెచ్చి వారికి భోజనం వడ్డించాడు. తాను తన ఇంటివారందరు దేవుని నమ్ముకున్నందుకు అతడు ఆనందించాడు. మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు. ఆ చెరసాల అధికారి పౌలుతో, “న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కాబట్టి మీరు సమాధానంగా బయలుదేరండి” అని చెప్పాడు. అయితే పౌలు ఆ భటులతో, “రోమీయులమైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండానే బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపించాలని అనుకుంటున్నారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లాలి” అని చెప్పాడు. ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియజేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు. కాబట్టి వారు వీరిని శాంతింప చేయడానికి వచ్చి, చెరసాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి, పట్టణం విడిచిపొమ్మని బ్రతిమాలారు. పౌలు సీలలు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు లూదియ ఇంటికి వెళ్లారు, అక్కడ సహోదర సహోదరీలను కలిసి వారిని ప్రోత్సహించిన తర్వాత, వారు అక్కడినుండి బయలుదేరి వెళ్లిపోయారు.