సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు. చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు. ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు. అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకున్నారు. ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తెచ్చి వారికి భోజనం వడ్డించాడు. తాను తన ఇంటివారందరు దేవుని నమ్ముకున్నందుకు అతడు ఆనందించాడు. మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు. ఆ చెరసాల అధికారి పౌలుతో, “న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కాబట్టి మీరు సమాధానంగా బయలుదేరండి” అని చెప్పాడు. అయితే పౌలు ఆ భటులతో, “రోమీయులమైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండానే బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపించాలని అనుకుంటున్నారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లాలి” అని చెప్పాడు. ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియజేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు. కాబట్టి వారు వీరిని శాంతింప చేయడానికి వచ్చి, చెరసాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి, పట్టణం విడిచిపొమ్మని బ్రతిమాలారు. పౌలు సీలలు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు లూదియ ఇంటికి వెళ్లారు, అక్కడ సహోదర సహోదరీలను కలిసి వారిని ప్రోత్సహించిన తర్వాత, వారు అక్కడినుండి బయలుదేరి వెళ్లిపోయారు.
Read అపొస్తలుల కార్యములు 16
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 16:25-40
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు