అపొస్తలుల కార్యములు 16
16
పౌలు సీలలతో పరిచర్యలో తిమోతి
1పౌలు దెర్బేకు వచ్చి అక్కడినుండి లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతి అనే పేరుగల విశ్వాసిని కలుసుకున్నాడు. అతని తల్లి క్రీస్తును విశ్వాసించిన యూదురాలు తండ్రి గ్రీసు దేశస్థుడు. 2లుస్త్ర ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు. 3పౌలు తన ప్రయాణంలో అతన్ని వెంట తీసుకుని వెళ్లాలని భావించి, ఆ ప్రాంతంలోని యూదులందరికి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని తెలుసు కాబట్టి వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు. 4వారు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తూ, యెరూషలేములోని అపొస్తలుల సంఘపెద్దల నిర్ణయాలను ప్రజలు పాటించడం కోసం అప్పగించారు. 5కాబట్టి సంఘాలన్ని విశ్వాసంలో బలపడుతూ, ప్రతిరోజు విశ్వాసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
మాసిదోనియా గురించి పౌలుకు వచ్చిన దర్శనం
6పౌలు అతనితో ఉన్నవారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఆసియా ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని బోధించనియ్యలేదు. 7ఆ తర్వాత వారు ముసియ ప్రాంత సరిహద్దు దగ్గరకు వచ్చి, బితూనియ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు కానీ యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు. 8కాబట్టి వారు ముసియ ప్రాంతాన్ని దాటి త్రోయ పట్టణానికి వెళ్లారు. 9రాత్రివేళలో కలిగిన దర్శనంలో మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి నిలబడి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని తనను బ్రతిమాలుతున్నట్లు పౌలు చూశాడు. 10పౌలు ఆ దర్శనాని చూసిన తర్వాత, వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని నిర్ణయించుకొని, వెంటనే మాసిదోనియ ప్రాంతానికి వెళ్లడానికి మేము సిద్ధపడ్డాము.
ఫిలిప్పీ పట్టణంలో లూదియా మార్పు చెందుట
11మేము త్రోయ ప్రాంతాన్ని వదిలి ఓడ ఎక్కి నేరుగా సమొత్రాకే ద్వీపానికి వచ్చి, మరుసటిరోజు నెయపొలి ప్రాంతానికి వెళ్లాము. 12అక్కడినుండి మేము ప్రయాణం చేసి, రోమీయులున్న మాసిదోనియ ప్రాంతంలోని ముఖ్య పట్టణమైన ఫిలిప్పీకు వెళ్లాము. మేము అక్కడ చాలా రోజులు ఉన్నాము.
13ఒక సబ్బాతు దినాన ప్రార్థన స్థలమేదైనా ఉంటుందేమో చూద్దామని, పట్టణ ద్వారాన్ని దాటి నదీ తీరానికి వెళ్లాము, మేము ఒక చోటున కూర్చుని అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడడం ప్రారంభించాము. 14అక్కడ వింటున్న వారిలో తుయతైర పట్టణానికి చెందిన, ఊదా రంగు బట్టలను అమ్మే లూదియ అనే స్త్రీ ఉంది. ఆమె దేవుని ఆరాధించేది. పౌలు చెప్పిన మాటలకు స్పందించేలా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచారు. 15కాబట్టి ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆమె మాతో, “నేను ప్రభువు విశ్వాసినని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండవలసిందే” అని తన ఇంటికి రమ్మని బ్రతిమాలి మమ్మల్ని ఆహ్వానించింది.
చెరసాలలో వేయబడిన పౌలు సీలలు
16మరొక రోజు మేము ప్రార్థన స్థలానికి వెళ్తుండగా, దయ్యం పట్టి సోదె చెప్పే ఒక బానిస స్త్రీ మాకు ఎదురయింది. ఆమె సోదె చెప్తూ తన యజమానికి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేది. 17ఆమె పౌలును మమ్మల్ని వెంబడిస్తూ, “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తున్నారు” అని బిగ్గరగా అరిచి చెప్పింది. 18ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ ఉంది. చివరికి ఒక రోజు పౌలు చాలా చికాకుపడి ఆమె వైపు తిరిగి దయ్యంతో, “నీవు ఈమె నుండి బయటకు వెళ్లిపో అని యేసు క్రీస్తు పేరట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను!” అని గద్దించాడు. వెంటనే ఆ దయ్యం ఆమెను వదిలిపోయింది.
19ఆమె యజమానులు ఇక వారికి ఆదాయం వచ్చే మార్గమే లేకుండా పోయిందని గుర్తించి, వారు పౌలు సీలలను పట్టుకుని ఆ పట్టణ సంతవీధులలో ఉండే అధికారుల దగ్గరకు వారిని ఈడ్చుకొని పోయారు. 20వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ, 21మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు” అని చెప్పారు.
22జనసమూహం కూడా వారి మీద దాడి చేశారు, కాబట్టి న్యాయాధికారులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. 23వారిని తీవ్రంగా దెబ్బలు కొట్టి, చెరసాలలో పడవేసి, భద్రంగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. 24అతడు ఈ ఆదేశాలను పొందుకొని, వారిని చెరసాలలోని లోపలి గదిలో కాళ్లను చెక్క మొద్దులలో ఇరికించి బంధించాడు.
25సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. 26అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి. 27ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. 28వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు.
29చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు. 30ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు.
31అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు. 32అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు. 33ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకున్నారు. 34ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తెచ్చి వారికి భోజనం వడ్డించాడు. తాను తన ఇంటివారందరు దేవుని నమ్ముకున్నందుకు అతడు ఆనందించాడు.
35మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు. 36ఆ చెరసాల అధికారి పౌలుతో, “న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కాబట్టి మీరు సమాధానంగా బయలుదేరండి” అని చెప్పాడు.
37అయితే పౌలు ఆ భటులతో, “రోమీయులమైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండానే బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపించాలని అనుకుంటున్నారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లాలి” అని చెప్పాడు.
38ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియజేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు. 39కాబట్టి వారు వీరిని శాంతింప చేయడానికి వచ్చి, చెరసాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి, పట్టణం విడిచిపొమ్మని బ్రతిమాలారు. 40పౌలు సీలలు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు లూదియ ఇంటికి వెళ్లారు, అక్కడ సహోదర సహోదరీలను కలిసి వారిని ప్రోత్సహించిన తర్వాత, వారు అక్కడినుండి బయలుదేరి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 16: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.