అపొస్తలుల 16:25-40

అపొస్తలుల 16:25-40 TERV

అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బంధీలు వింటున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి. చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు. ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు. వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు. ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు. ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోనివాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోనివాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు. తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయమని ఆజ్ఞాపించారు. “నిన్ను, సీలను విడుదల చేయమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి!” అని చెరసాల అధికారి అన్నాడు. కాని పౌలు వాళ్ళతో, “మేము రోమా పౌరులమైనా విచారణ జరుపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు. కారాగారంలో పడవేసారు. కాని యిప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు. భటులు ఈ వార్త అధికారులకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీల రోమా పౌరులని విని భయపడిపోయారు. అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించమని వేడుకొన్నారు. వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు. పౌలు, సీల కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.

అపొస్తలుల 16:25-40 కోసం వీడియో