అపొస్తలుల కార్యములు 13:13-25
అపొస్తలుల కార్యములు 13:13-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తర్వాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి పంఫులియా లోని పెర్గే పట్టణానికి వచ్చారు, యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు వారు పెర్గే పట్టణం నుండి బయలుదేరి పిసిదియ ప్రాంతంలోని అంతియొకయ పట్టణానికి వచ్చారు. సబ్బాతు దినాన వారు సమాజమందిరానికి వెళ్లి కూర్చున్నారు. ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను చదివిన తర్వాత సమాజమందిరపు అధికారులు, “సహోదరులారా, ప్రజలను ప్రోత్సహించే వాక్యం చెప్పాలని ఉంటే చెప్పండి” అని వారికి వర్తమానం పంపారు. పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి! ఇశ్రాయేలు దేశ ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకుని, వారిని ఈజిప్టులో అభివృద్ధిపరచి, వారిని తన గొప్ప శక్తితో ఆ దేశం నుండి బయటకు రప్పించారు. రప్పించిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి ప్రవర్తనను సహించారు, కనాను దేశంలోని ఏడు జాతుల వారిని తరిమివేసి, వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చారు. సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ సంఘటనలన్ని జరిగాయి. “ఆ తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చారు. తర్వాత ప్రజలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు, దేవుడు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలును వారికి రాజుగా ఇచ్చారు, అతడు వారిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు. సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి, ‘యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. నేను చేయాలని ఉద్దేశాలన్నిటిని అతడు నెరవేరుస్తాడు’ అని సాక్ష్యమిచ్చారు. “దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, దావీదు సంతానం నుండి ఇశ్రాయేలు ప్రజల కోసం యేసు రక్షకుని పుట్టించారు. యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. యోహాను తాను వచ్చిన పనిని ముగిస్తూ, ‘నేను ఎవరని మీరు అనుకుంటున్నారా? మీరు ఎదురు చూస్తున్న వానిని నేను కాదు. కాని నా తర్వాత వస్తున్న వాని చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు’ అన్నాడు.
అపొస్తలుల కార్యములు 13:13-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫులియా లోని పెర్గ కు వచ్చారు. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోని అంతియొకయ వచ్చి విశ్రాంతిదినాన సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు. ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, “సోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా ప్రోత్సాహ వాక్కు చెప్పాలంటే చెప్పండి” అని అడిగారు. అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దేవుడంటే భయభక్తులున్న వారలారా, వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకులను ఏర్పరచుకుని, వారు ఐగుప్తు దేశంలో ఉన్నపుడు ఆ ప్రజలను అసంఖ్యాకులుగా చేసి, తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చాడు. సుమారు నలభై ఏళ్ళు అరణ్యంలో వారిని సహించాడు. కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు. ఈ సంఘటనలన్నీ సుమారు 450 సంవత్సరాలు జరిగాయి. ఆ తరువాత సమూయేలు ప్రవక్త వరకూ దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ తరువాత వారు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడూ కీషు కుమారుడూ అయిన సౌలును వారికి నలభై ఏళ్ళ పాటు రాజుగా ఇచ్చాడు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు. “అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు. ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, “నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు” అని చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 13:13-25 పవిత్ర బైబిల్ (TERV)
“పాఫు” నుండి పౌలు, అతని స్నేహితులు పంఫూలియాలోని “పెర్గే” అనే పట్టణానికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు పెర్గేనుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు. ఒక విశ్రాంతి రోజు యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చున్నారు. ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి” అని అడగనంపారు. పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పరదేశీయులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్పవాళ్ళుగా చేసాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశంనుండి వాళ్ళను పిలుచుకెళ్ళి, ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు. కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు. ఇవి చేయటానికి సుమారు నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది. “ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలందాకా, నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు. తమకు ‘రాజు’ కావాలని కోరగా కీషు కుమారుడైన ‘సౌలును’ వాళ్ళకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై సంవత్సరాలు పాలించాడు. సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’ “దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు. యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు? నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.’
అపొస్తలుల కార్యములు 13:13-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు–సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను– ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను. ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను. ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్లవరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన–నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా –నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.
అపొస్తలుల కార్యములు 13:13-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)